దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. వ్యాక్సిన్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్న క్రమంలో టీకాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని రాజ్యసభలో వెల్లడించారు.
"ఇతర దేశాల తరహాలోనే వ్యాక్సిన్ కోసం భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మూడు వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంది. టీకా పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధంగా ఉంది. భారత్‌లో వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే నమ్మకం ఉంది."
- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
దేశీయంగా తయారైన జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నాయి. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ) అనుమతులు ఇచ్చిన క్రమంలో ఇటీవల నిలిచిపోయిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రజెనెకా టీకా ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించింది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వాటితో పాటు భారత్‌లో స్పుత్నిక్-వీ టీకా ట్రయల్స్, పంపిణీపై రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీసీజీఏ అనుమతులు ఇవ్వగానే భారత్‌కు 100 మిలియన్ డోస్‌లను సరఫరా చేయనుంది రష్యా.
ఇదీ చూడండి: డా.రెడ్డీస్‌కు 10 కోట్ల రష్యా టీకా డోసులు