ప్రపంచ దేశాలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. కొవిడ్‌కు టీకా.. 2021 ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ మీడియా సమావేశంలో తెలిపారు. వ్యాక్సిన్ భద్రత విషయంలో ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రమంత్రి.. దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
వారికే తొలి ప్రాధాన్యం..
వ్యాక్సిన్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి సిద్ధంగా ఉండొచ్చని హర్షవర్ధన్ పేర్కొన్నారు. అయితే.. వృద్ధులు, వైరస్ ముప్పు అధికంగా ఉన్నవారికే తొలుత టీకా అందించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పిన ఆయన.. దీనిపై ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణలో భాగంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు పాటిస్తోందని స్పష్టం చేశారు. టీకా భద్రత, ఖర్చు వంటి అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు మంత్రి.