దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలను పెంచింది కేంద్రం. ఫలితంగా రోజూ సుమారు 4 లక్షల కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,42,263 శాంపిళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.
ఇప్పటివరకు 1,62,91,331 శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 140 పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలో దాదాపు 19 రాష్ట్రాలు 140(పది లక్షల జనాభాకు) కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 60 వేల పరీక్షలు చేశారు.
పెరిగిన ప్రయోగశాలలు..
ప్రస్తుతం దేశంలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు 1307 లేబొరేటరీలకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 905 ప్రభుత్వ, 402 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. మొత్తం ల్యాబ్‌లలో దాదాపు 665 కేంద్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 23 నాటికి దేశంలో ఒకే ఒక్క లేబొరేటరీ అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 1307కు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.