కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. మరీ ముఖ్యంగా మాస్కుల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా మాస్కుల కొరత ఏర్పడింది. దీనివల్ల అవసరమైనవారికి మాస్కులు లభించడం లేదు.
ముఖ్యంగా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకూ ఈ పరికరాలు అందటం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాస్కులు ఎవరు ధరించాలన్న విషయంపై కొన్ని సూచనలు చేసింది.
- కరోనా సోకిన వ్యక్తికి కాని, లేదా అనుమానితుడిని మీరు పర్యవేక్షిస్తున్నట్లయితే మాస్కు అవసరం.
- జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు మాస్కును వాడాలి.
- వైద్య సిబ్బంది అయితే.. అది కూడా శ్వాసకోస సంబంధ వ్యాధుల విభాగంలో పనిచేస్తున్నప్పుడు మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలి.
అయితే మాస్కులను వినియోగించేప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
1. మాస్కును ఉపయోగించే ముందు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి, సబ్బు లేదా ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్‌ను ఉపయోగించి కడుక్కోవాలి.
2. ముక్కు, నోరు పూర్తిగా కప్పేయాలి. ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి.
3. సర్జికల్ మాస్కు వాడుతున్నట్లయితే.. ముడుతలను సరిగా విప్పి అవి కిందివైపు ఉండే విధంగా చూసుకోవాలి.
4. ఒకసారి వాడిపడేసే మాస్కులను మరోసారి వినియోగించకూడదు.
5. మాస్కు తడిసినట్లయితే వెంటనే తీసేయాలి.