కరోనా వైరస్ను నియంత్రించేందుకు తక్కువ స్థాయి నిబంధనలు సరిపోతాయని ప్రముఖ వైరాలజీ నిపుణులు జాకబ్ జాన్ అభిప్రాయపడ్డారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్చచ్చని చెబుతున్నారు.
ఈటీవీ భారత్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్ తయారీపై అనేక విషయాలను వెల్లడించారు.
ప్రశ్న: దేశంలో దశలవారీగా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం కరోనా వ్యాప్తిని నియంత్రించగలమా? ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవల్సిన చర్యలు ఏంటి?
జ:దీన్ని మనం రెండు విధాలుగా చూడాలి. ఒకటి.. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉన్నా కేసులు పెరిగాయి. 20 రోజుల్లో 20 రెట్లు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్న విషయం నిజమే. అయితే వైరస్ వ్యాప్తి అనుకున్న స్థాయిలో నియంత్రణలోకి రాలేదు. కానీ అదే వ్యాప్తి అరికట్టేందుకు సరైన సమయం. అప్పుడే మాస్కుల ప్రాముఖ్యం మనందరికీ తెలిసింది. ఆ సమయంలోనే మరింత కఠినంగా వ్యవహరించి ఉంటే ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా మంచి ఫలితాలు వచ్చి ఉండేవి.
తర్వాతి దశలో భౌతిక దూరాన్ని 6 అడుగుల నుంచి 2,3 అడుగులకు తగ్గించి ఉండాల్సింది. ఆర్థిక, సామాజిక, విద్యా, రవాణా తదితర కార్యకలాపాలను ఏప్రిల్ 15 నుంచి పునరుద్ధరించి ఉంటే బాగుండేది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారిని నిర్బంధంలోనే ఉంచాలి.
నిజానికీ రెండోసారి లాక్డౌన్ పొడిగించినప్పుడు విభేదించాను. మూడోసారి కూడా పొడిగించేసరికి నిరాశ పడ్డాను.
ప్రశ్న: సిటీ బస్సులు, సబ్అర్బన్ రైళ్లలో ప్రయాణికులపై చాలా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తూ భౌతిక దూరం నిబంధనలను పాటించటం సాధ్యమవుతుందా?
జ: దీనికి చాలా సరళమైన పరిష్కారం ఉంది. భౌతిక దూరాన్ని 2 నుంచి 3 అడుగులకు పరిమితం చేసి మాస్కులు ధరించేలా నిబంధనలు అమలు చేయాలి. మాస్కులు ధరించి ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చు. అయితే ఈ మహమ్మారి అంతమయ్యేంత వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఇదే అన్నింటికన్నా ముఖ్యం.
ప్రశ్న: ఉష్ణోగ్రతకు కరోనా వ్యాప్తికి ఏమైనా సంబంధం ఉందా? తమిళనాడులో విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇది అక్కడ కరోనా వ్యాప్తిని ప్రభావితం చేస్తుందా?
జ: వాతావరణంలో ఎంత వేడి అయినా ఉండనివ్వండి... మన శరీరంలోనే ఎప్పుడూ 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అయినప్పటికీ వైరస్ పెరుగుతుంది. తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. వాటిని గ్రహించటం ద్వారా ఇతరులకు సోకుతుంది. "ఫొమైట్ ట్రాన్సిమిషన్" తగ్గే అవకాశం ఉంది. అంటే ఉపరితలాలు, వస్తువుల నుంచి సంక్రమించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే వేడి వాతావరణం వైరస్ను నియంత్రిస్తుందని చెప్పలేం. కొద్దిమేర తగ్గవచ్చు. కానీ వర్షాకాలంలో వాతావరణం చల్లబడితే మళ్లీ విజృంభించవచ్చు.
ప్రశ్న: నైరుతి రుతుపవాలు ప్రారంభమైతే మళ్లీ వైరస్ వేగంగా విస్తరిస్తుందా? వర్షాలు పడకుంటే వ్యాప్తి నియంత్రణలో ఉండే అవకాశం ఉందంటున్నారా?
జ: వర్షాకాలంలో ఏం జరుగుతుందో చెప్పలేం? వేచి చూడాల్సిందే!