కరోనా భూతాన్ని ఎదుర్కోవడానికి త్వరలోనే వ్యాక్సిన్ రానుంది. ఈ నేపథ్యంలో టీకా వేయడానికి కావాల్సిన సిరంజీలు, సూదుల ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది అఖిల భారత సిరంజీ, సూదుల ఉత్పత్తి సంఘం(ఏఐఎస్ఎన్ఎంఏ). కరోనా టీకాలు వేసే కార్యక్రమంలో అవసరానికి అనుగుణంగా అదనపు సామర్థ్యంతో నెలకు 350 మిలియన్ సిరంజీలు ఉత్పత్తి చేయగలమని ఏఐఎస్ఎన్ఎంఏ పేర్కొంది.
కరోనా సోకకుండా వినియోగించే మాస్క్లు, పీపీఈ కిట్ల ఉత్పత్తిలో అనుభవం ద్వారా సిరంజీల తయారీ సంస్థలు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే పనిలో పడ్డాయని లేఖలో వివరించింది ఏఐఎస్ఎన్ఎంఏ. "సిరంజీల లభ్యతలో మన దేశం 'ఆత్మనిర్భర్ భారత్' అని అసోసియేషన్ సభ్యులు దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు. రాబోయే అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడకూడదు" అని పేర్కొంది.