కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి భారతీయ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే... దేశంలో పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ పురోగతి సాధించే అవకాశం లేదని అంచనావేస్తున్నారు.
దేశంలోని ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. పీఎం కేర్స్ నిధి నుంచి రూ.100 కోట్లు కేటాయించింది.
"కరోనా సంక్షోభం నివారణకు వ్యాక్సిన్ అవసరం చాలా ఉంది. భారతీయ శాస్త్రవేత్తలు, అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు వ్యాక్సిన్ అభివృద్ధి, రూపకల్పనకు కలిసి రావాలి. టీకా అభివృద్ధి కోసం మార్గాలను గుర్తించేందుకు బయోటెక్నాలజీ శాఖను సమన్వయ సంస్థగా పనిచేస్తుంది."
- ప్రధాని కార్యాలయం
జైడస్ కాడిలా సంస్థ రెండు వ్యాక్సిన్లను రూపొందించే పనిలో ఉందని టీహెచ్ఎస్టీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్‌వ్యాక్స్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అయితే జైడస్, సీరమ్, ఐఐఎల్, భారత్ బయోటెక్ సంస్థలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది.
"వ్యాక్సిన్ తయారీలో భారత్ సామర్థ్యం చాలా గొప్పది. సీరమ్, భారత్ బయోటెక్, బయెలాజికల్స్ సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి వ్యాక్సిన్ తయారీలో చాలా ముందున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి తొలి దశలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా జంతువులపై పరీక్షించే అవకాశం ఉంది."
- షాహిద్ జమీల్, ప్రముఖ వైరాలజిస్ట్