తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వ్యాక్సిన్‌కు ఏడాది పడుతుంది: హర్షవర్ధన్​ - కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం ఓ సంవత్సరమైనా పడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. భారతీయ సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 3 నుంచి 5 నెలల్లో క్లినికల్ ట్రయల్స్​ దశకు వచ్చే అవకాశముందన్నారు.

COVID-19 vaccine candidates may enter clinical trial phase in 3-5 months: Vardhan
కరోనా వ్యాక్సిన్‌కు ఏడాది పడుతుంది: హర్షవర్ధన్​

By

Published : May 25, 2020, 12:49 PM IST

కరోనా వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఏడాది పడుతుందని, భారతీయ సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 3 నుంచి 5 నెలల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు వస్తాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ప్రస్తుతం అవి క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందస్తు దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు ఆదివారం ఆయన సమాధానం ఇచ్చారు.

"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 వ్యాక్సిన్‌ క్యాండిడేట్లు (సంస్థలు) పరిశోధనలు చేస్తున్నాయి. భారత్‌ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలో 14 వ్యాక్సిన్‌ సంస్థలు విభిన్న స్థాయిల్లో పనిచేస్తున్నాయి. వీటిలో 4 మరో 5 నెలల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు. పరిశోధనలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని కనీసం సంవత్సరమైనా పడుతుందని ఓ వైద్యుడిగా నాకున్న అనుభవాన్ని బట్టి చెబుతున్నా. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మాస్క్‌లు వాడటం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి."

- హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

కరోనా చాలా విషయాలు నేర్పింది

'మనకు ప్రతి వైరస్‌ ఏదో ఒక కొత్త అంశం నేర్పించి వెళ్తుంది. హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటివన్నీ జీవితంలో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాయి. ఇప్పుడు కరోనా కూడా మనకు చాలా మంచి విషయాలు నేర్పింది. వాటిని జీవితంలో అంతర్భాగంగా చేసుకుంటే చాలు. కరోనా నుంచి రక్షించుకోవడం రాకెట్‌ సైన్స్‌ అంత కష్టం కాదు. వైరస్‌ వ్యాప్తి మరింత ఉద్ధృతమవుతుందా? లేదా అన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఈ వైరస్‌ పుట్టి నాలుగైదు నెలలే అయింది కనుక దీన్ని అంచనా వేయడం కష్టం. వైరస్‌ను విడదీయగలిగిన (ఐసోలేట్‌ చేసిన) అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ చేరింది. ఇప్పుడు సీఎస్‌ఐఆర్‌ దీనిపై పరిశోధనలు చేస్తోంది. ఒకవేళ రెండోసారి కరోనా వైరస్‌ వచ్చినా మనం ప్రస్తుతం నేర్చుకున్న అనుభవాల వల్ల అదేమీ పెద్ద ప్రభావం చూపలేదు. అప్పటిలోగా దానిపై పోరాడటానికి పూర్తిస్థాయి అనుభవం సంపాదించుకుంటాం' అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. మర్కజ్‌ కారణంగా భారత్‌లో ఉన్నట్టుండి కేసులు పెరిగాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్లే కేసులు నియంత్రణలో ఉన్నాయన్నారు. అందరు రోగులనూ ఒకే ఆసుపత్రిలో పెట్టడం వల్ల ఇటలీలో కేసులు పెరిగాయని, ఆ అనుభవాన్ని చూసే భారత్‌లో కొవిడ్‌ కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,977 కేసులు, 154 మరణాలు

ABOUT THE AUTHOR

...view details