మానవ చరిత్రలో మరపురాని విజయాలెన్నో. యాభై ఏళ్ల క్రితమే చంద్రునిపై కాలు మోపిన ఘన కీర్తి. శాస్త్రసాంకేతికత రంగంలో సాధించిన అద్భుతాలు. ఆకాశాన్ని తాకే హర్మ్యాలు, గాళ్లో ఎగిరే విమానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పరంపరకు అడ్డులేదు.
మరి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక చిన్న వైరస్ ముందు తలవంచుతోంది. దేశదేశాలన్నీ ఈ జీవి ధాటికి వణికిపోతున్నాయి. స్మశానాలన్నీ మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. వైరస్ నుంచి రక్షించుకోవడానికి నెలల తరబడి ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వైరస్ వ్యాప్తి మొదలై ఆరు నెలలు గడిచినా.. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికీ భరోసా లేదు. మరో సంవత్సరం వరకు సమర్థమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలే తేల్చిచెబుతున్నారు. వ్యాక్సిన్ కోసం జరుగుతున్న చాలా ప్రయోగాలు ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉండటం మరింత కలవరపెడుతోంది.
వివిధ దశల్లో ప్రయోగాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 10 క్యాండిడేట్ వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్ దశల్లో ఉన్నాయి. అంటే ఈ వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ప్రయోగ ఫలితాలను బట్టి ఈ వ్యాక్సిన్లకు అనుమతులు లభిస్తాయి. మరో 126 సంస్థలు ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయి. ఈ దశలో టీకా నాణ్యత, సామర్థ్యం, పనితీరును విశ్లేషిస్తారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాల్లో చాలా వరకు సరైన ఫలితాలు ఇవ్వడంలేదని నిపుణులు చెబుతుండటం గమనార్హం.
"ప్రపంచవ్యాప్తంగా సార్స్ కోవ్-2 వ్యాక్సిన్ అభివృద్ధి కోసం విస్తృత పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని పద్ధతులు 200 సంవత్సరాల నాటివి. మరికొన్ని దశాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నవి. వ్యాక్సిన్ రూపొందించడంలో ఇవేవీ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ అభివృద్ధి వినూత్నంగా కాకుండా అనుభవాత్మకంగా ఉంది. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే ఇవన్నీ వ్యాక్సిన్‌గా కాకుండా వ్యాక్సిన్ క్యాండిడేట్లుగా మిగిలిపోతున్నాయి."
-సత్యజిత్ రథ్, ఇమ్యునాలజిస్ట్
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో ఎత్తు. మార్కెట్లోకి వ్యాక్సిన్‌ను విడుదల చేయడం, ప్రజా వైద్య వ్యవస్థకు అందుబాటులో ఉంచడం ఒకటి కాదని నిపుణులు చెబుతున్నారు. పేదలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
"ఉత్పత్తి సామర్థ్యం ఒక అవరోధం. అందరికీ లభ్యమయ్యేలా చూడాలంటే తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో డోసులు తయారు చేయాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కలిసి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి"
-సత్యజిత్ రథ్, ఇమ్యునాలజిస్ట్
ఆకాశాన్నంటే ధర!
వ్యాక్సిన్ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారు కాబట్టి ధర విషయంపై సత్యజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. మేధోహక్కులను కూడా కలిపితే వ్యాక్సిన్ ధర మరింత పెరుగుతుందన్నారు. టీకా అభివృద్ధికి ప్రభుత్వాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయా అనే విషయం కూడా ఈ పోరులో విజయాన్ని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.