తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరస్​తో 'పోరు' కన్నా పక్కింటి 'తీరు' దారుణం!

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి కరోనాను జయించినా.. ఈ మహమ్మారి​ పట్ల సరైన అవగాహన లేని ఇరుగు పొరుగువారి అవహేళనను మాత్రం తట్టుకోలేకపోయాడు. వారి కుటుంబాన్ని అంటరానివారిగా చూస్తున్న కాలనీ వాసులకు దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. అందుకే పుట్టి పెరిగిన సొంత ఇంటిని అమ్మకానికి పెట్టాడు.

COVID-19 social boycott: Post recovery, man puts house on sale
కరోనాను జయించాక.. ఇల్లు అమ్ముకునే పరిస్థితి!

By

Published : Apr 14, 2020, 6:15 AM IST

భౌతిక దూరం పాటించమంటే అత్యుత్సాహానికి పోయి సామాజిక వివక్ష చూపుతున్నారు కొందరు. కరోనా అనుమానాలతో సాటి మనుషులను మానసికంగా హింసిస్తున్నారు. ఇరుగుపొరుగువారి వేధింపులు తట్టుకోలేక ఇంటినే అమ్మకానికి పెట్టాడు మధ్యప్రదేశ్​లోని ఓ కరోనా జయుడు.

శివపురికి చెందిన ఆ వ్యక్తి.. మార్చి​ 18న దుబాయ్​ నుంచి భారత్​కు వచ్చాడు. అతడికి మార్చి ​24న కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఫలితంగా అతడి తల్లి, తండ్రి, సోదరిని నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే ఆత్మవిశ్వాసంతో కరోనాను జయించి ఈ నెల 4న ఇంటికి చేరుకున్నాడు. అయితే గృహానికి రాగానే ఇరుగుపొరుగువారి ప్రవర్తన ఆ కుటుంబాన్ని కరోనా కంటే ఎక్కువ బాధకు గురి చేసిందట. వారిని నేరస్థులుగా చూస్తుంటే తట్టుకోలేకపోయిన వాళ్లంతా... సొంతూరు వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు! అంతేకాకుండా ఇష్టంతో కట్టుకున్న సొంతింటిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు.

" సమాజం మమ్మల్ని బహిష్కరిస్తుంటే సహించలేకపోతున్నాం. ఈ కాలనీలో ఇంక్కొక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. మా ఇంటికి పాలవాడిని, కూరగాయలవాడిని కూడా రానివ్వట్లేదు ఇరుగుపొరుగువారు. అందుకే ఇంటిని విడిచివెళ్లడం ఇష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకున్నాం."

-బాధితుడి తండ్రి

ఈ సమస్యపై వారు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. పాత గొడవలే కాలనీవాసుల ప్రవర్తనకు కారణం కావచ్చని భావిస్తున్నారు.

"కరోనా నిర్ధరణకు ముందు బాధిత కుటుంబం నిర్బంధ సమయంలో బయట తిరిగారు. బహుశా ఆ సమయంలోనే గొడవలు తలెత్తి ఉంటాయి. ఆ కుటుంబం నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే వారికి ఎలాంటి సాయం కావాలన్నా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం."

-రాజేశ్​ చంఢేల్, పోలీస్​.

ఇదీ చదవండి:'పాకిస్థాన్​.. అమాయకుల జోలికొస్తే ఖబడ్దార్​!'

ABOUT THE AUTHOR

...view details