మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బంగాల్ రాష్ట్రాల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రధానంగా ముంబయి, పుణె, ఇండోర్, జైపుర్, కోల్కతా నగరాల్లో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రకటించింది.
కరోనా పరీక్షలు నిర్వహించే వైద్యులపై దాడులు చేయడం, భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించడం, పట్టణాల్లో వాహనాల రాకపోకలు కొనసాగడం.. ఇవన్నీ మహమ్మారి వ్యాప్తికి కారణమని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆయా నగరాల్లో కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు ఆరు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్(ఐఎంసీటీ)లను ఏర్పాటు చేసింది కేంద్రం. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించింది.
"లాక్డౌన్ మార్గదర్శకాలు అమలయ్యేలా ఐఎంసీటీలు చూస్తాయి. అవసరమైన వస్తువుల సరఫరా, భౌతిక దూరం పాటించడం, మౌలిక వైద్య సదుపాయాలు, వైద్య నిపుణుల భద్రత తదితర విషయాలపై పరిస్థితులను అంచనా వేసి నివేదికలను కేంద్రానికి సమర్పిస్తాయి."
-కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన