అంతర్జాతీయ సప్లై చైన్ ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా వైరస్ మనకు నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డెన్మార్క్ ప్రధాని మెటి ఫ్రెడరిక్‌సన్‌తో సోమవారం జరిగిన వర్చువల్ ద్వైపాక్షిక సమావేశంలో ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''అంతర్జాతీయ సప్లై చైన్ ఒకే దేశంపై ఆధారపడడం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో కరోనా మనకు నిరూపించింది. ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు భారత్ ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఈ పద్ధతికి సానుకూలంగా ఉన్న దేశాలు ఇందులో భాగస్వామ్యం కావచ్చు.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
గత కొద్ది నెలల కాలంలో జరిగిన సంఘటనలు మూలంగా వివిధ దేశాలు కలిసి పనిచేయవలిసిన అవసరం ఏర్పడిందన్నారు మోదీ.
ఈ సందర్భంగా మోదీ.. భారత్‌లో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకం గురించి ఆమెకు వివరించారు. దాంతో పాటు వ్యవసాయం, కార్మిక రంగంలో తీసుకువచ్చిన మార్పుల గురించి తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద తాము అన్ని విధాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఉత్తర ఐరోపాకు చెందిన దేశాల్లో డెన్మార్క్ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
అధికారిక లెక్కల ప్రకారం.. 2016 నుంచి 2019 మధ్య భారత్, డెన్మార్క్ మధ్య వాణిజ్యం 30.49శాతం పెరిగింది. దాని విలువ దాదాపు 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్‌లో షిప్పింగ్, పునరుత్పాదక విద్యుత్, వ్యవసాయం, ఆహార సరఫరా సహా పలు రంగాల్లో డెన్మార్క్‌కు చెందిన 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. డానిష్ సంస్థల్లో 5వేల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా డెన్మార్క్‌లోనూ భారత్‌కు చెందిన 20 ఐటీ సంస్థలు నడుస్తున్నాయి.