దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళ పాఠశాలలను తెరిచే అంశంపై అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 5వరకు పాఠశాలలు మూసే ఉంటాయని తెలిపింది.
"అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 5వరకు మూసే ఉంటాయి. ఆన్‌లైన్ తరగతులు యథాతథంగా కొనసాగుతాయి" అని పేర్కొంటూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్ తరగతులు సజావుగా నిర్వహించేందుకు, ఇతర పనులకు అవసరమైన సిబ్బందిని పిలిచే అధికారం ఉంటుందని పేర్కొన్నారు.
కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. అనంతరం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో.. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు సెప్టెంబర్ 21 నుంచి స్వచ్ఛందంగా పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో నాగాలాండ్, హిమాచల్ సహ పలు రాష్ట్రాలు ఈ నెల 21 నుంచి స్కూళ్లు తెరవనున్నట్లు స్పష్టం చేశాయి.
సిలబస్ తగ్గింపు..
కరోనా నేపథ్యంలో.. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యార్థుల సిలబస్‌ను 40 శాతం తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది తమిళనాడు ప్రభుత్వం. 18 మందితో ఏర్పాటు చేసిన ప్యానెల్ సూచనల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.