"కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది.." ఈ మాటలో నిజం ఎంతో ఇంకా తెలియనప్పటికీ.. గబ్బిలాలను చూస్తుంటే మనుషులు భయపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం అలాంటిది మరి. కొందరు గబ్బిలాలకు దూరంగా ఉంటుంటే.. మరికొందరు వాటికి పూజలు చేస్తున్నారు. తమను ఏం చేయవద్దని ప్రార్థిస్తున్నారు.
బంగాల్లోని భాసర్దాబి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా గబ్బిలాలతో కలిసి సావాసం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఆ ప్రాంతంలో ఉన్న వెదురు పొదలో 1000కిపైగా గబ్బిలాలు నివాసముంటున్నాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు.
కానీ కరోనా వైరస్ వార్తతో అన్నీ మారిపోయాయి. గబ్బిలాల నుంచే వైరస్ సోకిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను ఏమీ చేయవద్దంటూ వాటికి పూజలు నిర్వహించారు.