ప్లాస్మా చికిత్స ద్వారా కొవిడ్ రోగుల్లో చాలా తక్కువ స్థాయిలోనే సత్ఫలితాలు వస్తున్నాయని తేలింది. మనదేశంలోని కొంతమంది పరిశోధకులు.. ఏప్రిల్ నుంచి జులై నెలలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్(బీఎంజే) గురువారం ఈ నివేదికను ప్రచురించింది.
కొవిడ్ సోకడం వల్ల మధ్యస్థంగా అనారోగ్యానికి గురైన 464 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో పాల్గొన్నవారంతా 18 ఏళ్ల వయసు పైబడిన వారే. మొత్తం బాధితుల్లో 239 మందికి 24 గంటల వ్యవధిలో రెండు సార్లు ప్లాస్మా ద్వారా చికిత్స అందించారు. మిగతా 229 మందిని సాధారణ చికిత్స ద్వారా పర్యవేక్షించారు. నెల తర్వాత ప్లాస్మా చికిత్స తీసుకున్న 19 శాతం అంటే 44 మంది రోగులు.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సాధారణ చికిత్స తీసుకున్న వారిలో 18 శాతం(41 మంది) బాధితుల పరిస్థితి విషమించింది.