తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా: నవంబరులో అత్యంత దారుణ స్థితి!

నవంబరు మధ్య నాటికి భారత్​లో కరోనా పరిస్థితి అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వెంటిలేటర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని తేలింది. 8 వారాల లాక్‌డౌన్‌ వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం కొద్దికాలం పాటు వాయిదా పడిందని సర్వే నిర్వహించిన బృందం వివరించింది.

COVID-19 peak in India may arrive mid-Nov, paucity of ICU beds, ventilators likely: Study
నవంబరు మధ్య నాటికి భారత్​లో​ అత్యంత దారుణ పరిస్థితి!

By

Published : Jun 14, 2020, 6:44 PM IST

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో నవంబర్‌ మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడు ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని అంచనా వేసింది పరిశోధకుల బృందం.

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ రీసెర్చ్ గ్రూపునకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 8 వారాల లాక్‌డౌన్‌ వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం 36-76 రోజులపాటు ఆలస్యమవుతోందని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్‌డౌన్‌ ఉపయోగపడిందని విశ్లేషించారు. ఇన్ఫెక్షన్‌ రేటును 69-97 శాతం మేర తగ్గించడానికీ లాక్​డౌన్​ ఉపయోగపడిందని లెక్కగట్టారు నిపుణులు. లాక్‌డౌన్‌ తర్వాత సుమారు 60 శాతం మేర ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని తెలిపారు. ఈ ప్రజారోగ్య చర్యలు నవంబర్‌ మొదటి వారం వరకు డిమాండ్‌ను అందుకుంటాయని, అనంతరం కొరత ఏర్పడొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత ఐసొలేషన్‌ పడకలు 5.4 నెలల వరకు, ఐసీయూ పడకలు 4.6 నెలలు, వెంటిలేటర్లు 3.9 నెలల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించకపోయి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్‌తో పోలిస్తే ఇది 83 శాతం తక్కువేనని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం మేర పెంచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలయ్యేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ మహమ్మారి కోసం ప్రజారోగ్య వ్యవస్థపై వెచ్చించే మొత్తం జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

ప్రస్తుత స్థితి ఇదీ...

దేశంలో జూన్‌ 9 నాటికి 958 కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో 1,67,883 ఐసొలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే 21,614 ఐసీయూ, 73,469 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఇవి కాకుండా 2,313 కొవిడ్‌ హెల్త్‌ సెంటర్లలో 1,33,037 ఐసొలేషన్‌, 10,748 ఐసీయూ, 46,635 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఇవికాక 7,525 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 7,10,642 పడకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 21,494 వెంటిలేటర్లు ఉన్నాయని, మరో 60,848 వెంటిలేటర్లకు ఆర్డర్‌ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: '3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం'

ABOUT THE AUTHOR

...view details