కరోనా బాధితులకు సత్వర, మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. అయితే... గుజరాత్లో కొందరు అధికారుల సమన్వయ లోపం వల్ల 25 మంది రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు రోడ్డుపైనే 6 గంటలపాటు నిరీక్షించారు.
అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఓ రోగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోతో వెలుగులోకి వచ్చింది.
"మొత్తం 25మందికి కరోనా లక్షణాలున్నట్లు నిర్ధరించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆసుపత్రిలో చేరడానికి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రాత్రి 8.45 అయ్యింది. మాకు భోజనం కూడా లేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు సహాయం చేయండి" అని ఆ వీడియోలో కోరింది ఓ మహిళ.
కేసు పత్రాల్లో తేడాల వల్లే..
ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జయంతి రవి, ఆరోగ్య శాఖ కమిషనర్ జై ప్రకాశ్ ఘటన స్థలానికి చేరుకొన్నారు. బాధితులకు వసతి, వైద్య సౌకర్యాలు కల్పించారు. 'రోగులకు సంబంధించిన పత్రాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. డేటా ఎంట్రీ సమయంలో తప్పులు దొర్లాయి. అందుకే ఆస్పత్రి సిబ్బంది అనుమతి నిరాకరించారు. చివరకు రోగులు అందరినీ చేర్చుకున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగనీయం' అని తెలిపారు జయంతి.
చికిత్స చేసే విధానం ఇదేనా?
"రెండు రోజుల క్రితం వైరస్ లక్షణాలతో ఓ పోలీసు కానిస్టేబుల్ అదే ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకు కనీసం పడకను కూడా ఏర్పాటు చేయలేదు" అని గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అర్జున్ మోద్ వడియా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. "కరోనా బాధితులకు చికిత్స చేసే విధానం ఇదేనా?" అని ప్రశ్నించారు.
ఈ విమర్శల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. కానిస్టేబుల్కు సరైన సౌకర్యాలు కల్పించినట్లు ఒక వీడియోను విడుదల చేసింది.
ఇదీ చూడండి:తండ్రి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి దూరం