ప్రపంచ వ్యాప్తంగా లక్షకు మించి ప్రాణాలు బలిగొన్న కరోనాపై ప్లాస్మా థెరపీ మెరుగ్గా పనిచేస్తోందంటున్నారు వైద్యులు. దక్షిణ దిల్లీ, సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీ సత్ఫలిచ్చిందని ప్రకటించారు.
సాధారణ జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వ్యకికి.. ఏప్రిల్ 4న వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఆ తర్వాత పరిస్థితి విషమించి.. నిమోనియా లక్షణాలు కనిపించాయి. ఏప్రిల్ 8న అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ప్లాస్మా థెరపీ చేశారు. అనూహ్యంగా కరోనా నుంచి కోలుకోవడం మొదలెట్టాడు ఆ బాధితుడు.
"బాధితుడి కుటుంబ సభ్యులు ప్లాస్మా దాతను ఏర్పాటు చేశారు. మూడు వారాల క్రితం కరోనాను జయించిన ఆ వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి, బాధితుడి శరీరంలోకి పంపించాం. ప్లాస్మా థెరపీ చేసిన నాలుగు రోజులకే, అతడి శరీరంలో గణనీయమైన మార్పు వచ్చింది. వెంటిలేటర్ లేకుండా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన నోటితో ఆహారం తీసుకుంటున్నారు. ప్లాస్మా థెరపీ అతడు కోలుకోవడానికి దోహదపడింది."
-మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు