ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. విద్యార్థులూ ఇదే బాటలో నడుస్తున్నారు. విదేశాల్లో చదవాలనుకున్న భారతీయ విద్యార్థుల ఆశలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా 48శాతం మంది విద్యార్థులు స్వదేశాంలోనే చదవడానికి ఇష్టపడుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది క్వాక్వారెల్లి సైమండ్స్(క్యూఎస్). భారత్‌లోని అంతర్-రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తగ్గిన అవకాశాలు..
విదేశాల్లో చదువు అంటేనే ఖర్చుతో కూడుకున్న విషయం. అధిక వ్యయం పెట్టి చదువుకున్నా తగిన ఫలితం దక్కకపోతే ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్లి చదవడం కంటే స్వదేశంలోనే చదువుకోవడం మేలు అని విద్యార్థులు భావిస్తున్నట్లు క్యూఎస్ నివేదించింది. ప్రస్తుతం వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని.. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని క్యూఎస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నట్లు పేర్కొంది.
'భారతీయ విద్యార్థుల పరివర్తన 2020' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది క్యూఎస్. విదేశాల్లో ఉన్నత విద్య మీద కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపిందని ఇందులో పేర్కొంది.