దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. జైళ్లలో ఖైదీల రద్దీ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై స్పందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. మార్చి 20లోగా తమ స్పందన తెలపాలని, ఈ విషయంపై కోర్టుకు సాయం అందించేందుకు మార్చి 23లోగా ఒక అధికారిని నియమించాలని పేర్కొంది.
న్యాయ ప్రక్రియలో భాగంగా జువెనైళ్లు కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అంశాన్ని కూడా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను నియంత్రించేందుకు భారత్లోని కొన్ని రాష్ట్రాలు ముమ్మర చర్యలు తీసుకుంటుంటే.. మరికొన్ని మాత్రం స్పందించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు సుప్రీం తెలిపింది. ప్రజలు గుమిగూడటం ద్వారా కరోనా వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది.