దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపుపై, వైరస్ వ్యాప్తితో తలెత్తే పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 30 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపే అన్ని సమస్యలకు పరిష్కారమని విన్నవించారు.
రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం లాక్డౌన్ను పొడిగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో 2 వారాలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్డౌన్ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్?
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానితో మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏప్రిల్ 14 తరువాత కనీసం 15 రోజులపాటైనా లాక్డౌన్ పొడిగించాలని సూచించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. పలు రాష్ట్రాలు కూడా మరో రెండు వారాలపాటు లాక్డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపాయి.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే తమతమ రాష్ట్రాల్లో లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం... ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్డౌన్ను కొన్ని సడలింపులతో పొడిగించే అవకాశముంది.
మినహాయింపులు
కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. ప్రస్తుతం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. మరి లాక్డౌన్ పొడిగిస్తే మరిన్ని వర్గాల ప్రజలకు, సేవలకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరముందో? లేదో? సూచించాలని కోరింది.
ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించాలని, నిర్మాణ పరిశ్రమకు గ్రేడెడ్ పద్ధతిలో మినహాయింపులు ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.