దేశంలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు కారణంగా సుప్రీంకోర్టులో ముఖ్యమైన కేసుల విచారణ ఆలస్యం కానుంది. పలు కీలకమైన కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా సుప్రీం ఇప్పటికే దాని కార్యకలాపాలను పరిమితం చేసింది. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను విచారిస్తోంది.
సుప్రీంకోర్టులో పౌరసత్వం సవరణ చట్టం, ఆర్టికల్ 370 నిబంధనల రద్దుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యాలు పరిశీలనలో ఉన్నాయి. వీటితోపాటు మత సంప్రదాయాలకు సంబంధించిన సమస్యలు న్యాయ పరిశీలనలో ఉన్నాయి. హోలీ తరువాత శబరిమలకు సంబంధించి మత స్వేచ్ఛ అంశాన్ని విచారించేందుకు తొలుత సిద్ధమయింది సుప్రీం కోర్టు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..
అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా వీటన్నింటిని విచారణను నిలిపేసింది కోర్టు. ధర్మాసనాల సంఖ్యను కూడా తగ్గించింది. విచారణలను అత్యవసర కేసులకే పరిమితం చేసింది. భౌతిక దూరం నిబంధన వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేయాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా లాక్డౌన్ పొడిగింపు వల్ల ఈ కేసులపై విచారణ మరింత ఆలస్యం కానుంది.
మరిన్ని కేసులు..
లాక్డౌన్ కారణంగా ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణ నిలిచిపోయింది. ఈ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, అతని కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సునంద పుష్కర్ హత్య కేసు, వీవీఐపీ ఛాపర్ కేసులూ పెండింగ్‌లో పడ్డాయి.
దిల్లీ హైకోర్టులోనూ..
దిల్లీ హైకోర్టులోనూ పలు కీలక కేసుల విచారణపై లాక్డౌన్ ప్రభావం పడింది. ఈశాన్య దిల్లీ అల్లర్లు, జామియా నగర్లో చెలరేగిన హింసకు సంబంధించి విచారణ ఏప్రిల్ 21కు వాయిదా వేశారు. అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏప్రిల్ 20కి వాయిదా వేసింది కోర్టు.
ఈశాన్య దిల్లీ అల్లర్లకు విచారణలను దిల్లీ ట్రయల్ కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ విచారణలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.