కరోనా విజృంభిస్తున్న వేళ పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచింది భారత్. లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు, 50 వేల సర్జికల్ చేతి గ్లవుజులను పంపించింది. భారత రాయబారి రివా గంగూలీ దాస్.. ఈ కరోనా వైద్య ఉపకరణాలను బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి జాహీద్ మాలిక్‌కు అందించారు. భారత్-బంగ్లాదేశ్ మైత్రి సుదృఢమవ్వాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో మిత్రదేశం నుంచి వచ్చిన సాయాన్ని స్వాగతించింది బంగ్లాదేశ్.
కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలని పేర్కొంటూ సార్క్ సభ్యదేశాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది భారత్. వైరస్‌పై పోరులో పరస్పరం సహకరించుకోవాలని ఉద్ఘాటించింది. ఈ క్రమంలోనే బంగ్లాకు వైద్య ఉపకరణాలను అందజేసినట్లు పేర్కొన్నారు భారత రాయబారి. ఇంతకుముందే వైద్య సిబ్బందికి అవసరమైన ఉపకరణాలను అందించినట్లు తెలిపారు. బంగ్లాకు సహకారంపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
"భారత్, బంగ్లాదేశ్ మైత్రి బలమైనది. పొరుగుదేశాలు ప్రధానం అన్న విధానంలో మాకు బంగ్లాదేశ్ మొదటిది. మేం అన్ని వేళలా మీతో ఉంటాం. గతంలోనూ మీకు సహకారం అందించాం. భవిష్యత్తులోనూ ఈ సహకారం కొనసాగుతుంది."