కరోనా కట్టడి చర్యల్లో భౌతిక దూరం పాటించటం ముఖ్యం. కానీ కరోనా బాధితులను పర్యవేక్షించే వైద్యులకు మాత్రం ఈ అవకాశం ఉండదు. వారికి వైరస్ సోకే అవకాశమున్న నేపథ్యంలో ఐఐటీ-బాంబేకు చెందిన బృందం ఓ సరికొత్త ఆవిష్కరణ చేసింది.
హృదయ స్పందనను వినేందుకు డిజిటల్ స్టెతస్కోప్‌ను తయారు చేసింది ఈ బృందం. ఛాతిపై పెట్టాల్సిన అవసరం లేకుండా దూరం నుంచే హృదయ స్పందనలను లెక్కించవచ్చని చెబుతున్నారు. దీనివల్ల కరోనా బాధితుల నుంచి ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు.
బ్లూటూత్ ద్వారా..
రోగి ఛాతి నుంచి గుండె కొట్టుకునే శబ్దాన్ని బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్‌గా వైద్యుడు వినే సదుపాయం ఈ డిజిటల్ స్టెత్లో అమర్చారు. ఫలితంగా రీడింగులను తీసుకోవడానికి రోగి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఈ బృంద సభ్యులు తెలిపారు.
"కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తికి శ్వాసకోశంలో సమస్యలు తలెత్తుతాయి. ఛాతి చేసే శబ్దాలు వినేందుకు వైద్యులు సంప్రదాయ స్టెతస్కోప్‌ను ఉపయోగిస్తారు. వీటి ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో గుర్తిస్తారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. దూరం నుంచే హృదయ స్పందనలను గుర్తించవచ్చు."
- ఆదర్శ, ఐఐటీ-బాంబే బృంద సభ్యులు