తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తేలికపాటి లక్షణాలు ఉంటే ఇంటివద్దే ఇలా చేయండి'

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలు ఉన్నవారు ఇంటివద్దనే జాగ్రత్తలు పాటిస్తే కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటివద్దనే నిర్బంధంలో ఉన్నవారి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

mild symptoms
ఇంటివద్దే జాగ్రత్తలు

By

Published : Apr 8, 2020, 1:18 PM IST

అన్ని దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడినవారితో ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

కరోనా సోకిన వారిలో చాలా తక్కువ మందికే తీవ్రమైన సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గండె, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారని తేలింది.

వీరికి ఆసుపత్రుల్లో చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంటివద్దనే కోలుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తితోపాటు వారి పర్యవేక్షించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అవేంటో చూద్దాం.

  • కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని మొదటగా ఐసోలేట్ చేయటం ముఖ్యం.
  • ఆ వ్యక్తికి గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రత్యేక గది కేటాయించాలి. అందులోనే మరుగుదొడ్డి ఉండేలా చూడాలి.
  • ఆ వ్యక్తితో మిగతా కుటుంబ సభ్యులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. కనీసం ఒక మీటర్ దూరంలోనైనా ఉండాలి. ఒకే మంచంపై పడుకోకూడదు.
  • ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి అవసరాలు తీర్చేందుకు కుటుంబంలోని ఎవరైనా ఒకరే ఉండాలి. మిగతావారంతా దూరంగా ఉండాలి.
  • ఆ వ్యక్తిని పర్యవేక్షించేవారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. బాధితుల దగ్గరకు వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • చేతులు కడుకున్నాక డిస్పోసబుల్ పేపర్ లేదా టవల్స్​తో తుడుచుకోవాలి. సోకిన వ్యక్తి, పర్యవేక్షించేవారిద్దరూ సర్జికల్ మాస్కులు ధరించాలి.
  • సోకిన వ్యక్తికి అవసరమైన వస్తువులన్నీ ప్రత్యేకంగా కేటాయించాలి. వాటిని శుభ్రం చేయడానికి వాడే సబ్బు, నీళ్లు కూడా వేరుగానే పెట్టాలి.
  • కరోనా సోకినవారు బిడ్డలకు పాలు ఇవ్వవచ్చు. కానీ ఆ సమయంలో మాస్కు ఉపయోగించటం తప్పనిసరి.
  • ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఏదైనా వస్తువును ముట్టుకుంటే వెంటనే శుభ్రం చేయాలి.

బాధితులకు తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. పోషకాహారం తీసుకోవాలి. ద్రవ ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు లక్షణాలను గమనిస్తూ ఉండాలి. శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బందులు వస్తే వెంటనే వైద్య సాయం పొందాలి.

ఇదీ చూడండి:'వైద్యులు ఒక్క మాస్కును 4 సార్లు వినియోగించాలి!'

ABOUT THE AUTHOR

...view details