ప్రాణాంతక కరోనా ఇప్పటికే దేశం నలుమూలల విస్తరించింది. ఈ క్రమంలో చర్యలు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా 'ఉమ్మడి నియంత్రణ ప్రణాళిక' రూపొందించింది. భౌగోళిక నిర్బంధం ద్వారా ప్రజలు ప్రయాణాలు చేయకుండా నిరోధించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, లద్దాఖ్ వంటి పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ఉమ్మడి నియంత్రణ ప్రణాళికను రూపొందించింది.
ప్రయాణాలే కారణం!
ఈ ప్రణాళిక ప్రకారం.. కరోనా కేసులను ముందుగా గుర్తించడం, పలు భౌగోళిక ప్రాంతాల మధ్య ఉండే గొలుసును విచ్ఛిన్నం చేయడం ద్వారా కొత్త ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. కరోనా సోకినవారు ప్రయాణాలు చేయడం వల్ల కేసులు పెరగుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.