తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆశాకిరణం: 'ఫావిపిరవిర్' ఫలితాలు సానుకూలం

కరోనాకు వ్యాక్సిన్​ కోసం అవిరామ ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. రోగులకు చికిత్స సులభతరం చేసే ఔషధాలు ఆశాజనక ఫలితాలిస్తున్నాయి. ఈ మేరకు గ్లెన్​మార్క్​ సంస్థ తయారు చేసిన ఫావిపిరవిర్ డ్రగ్ సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఫేజ్​-3 క్లినికల్ ట్రయల్స్​లో భాగంగా ఈ ఔషధం తీసుకున్న రోగులు త్వరగా కోలుకున్నట్లు పేర్కొంది.

By

Published : Jul 23, 2020, 10:58 AM IST

Glenmark's Favipiravir drug shows encouraging results
ఫావిపిరవిర్ సానుకూల ఫలితాలు

కరోనా బాధితుల కోసం గ్లెన్​మార్క్​ తయారు చేసిన ఫావిపిరవిర్ ఔషధం సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్​లో ఔషధం మెరుగైన పనితీరు కనబర్చినట్లు తెలిపింది. సాధారణ చికిత్స తీసుకున్న కరోనా రోగులతో పోలిస్తే ఫావిపిరవిర్ తీసుకున్నవారికి త్వరగా నయమైందని పేర్కొంది.

సాధారణ సమయంతో పోలిస్తే 40 శాతం వేగంగా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. ఫావిపిరవిర్ చికిత్స తీసుకున్న వ్యక్తులు మూడు రోజుల్లో క్లినికల్ క్యూర్ (ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు, దగ్గు వంటి లక్షణాలు తగ్గిపోవడం) సాధించినట్లు సంస్థ స్పష్టం చేసింది. సాధారణ చికిత్స తీసుకున్నవారిలో ఈ సమయం ఐదురోజులుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఫావిపిరవిర్ చికిత్స తీసుకున్నవారిలో 69.8 శాతం మంది రోగులు నాలుగో రోజుకల్లా క్లినికల్ క్యూర్ సాధించినట్లు స్పష్టం చేసింది. ఇది సాధారణ రోగుల్లో 44.9 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

"రోగి పరిస్థితి క్షీణించి ఆక్సిజన్ అవసరమయ్యే సమయంలోనూ సాధారణ రోగులకు, వీరికి గణనీయమైన తేడా ఉంది. ఫావిపిరవిర్ తీసుకున్న రోగులు సగటున ఐదు రోజుల తర్వాత ఆక్సిజన్ తీసుకుంటే సాధారణ రోగులు రెండు రోజులకు ఆక్సిజన్ తీసుకున్నారు."

-గ్లెన్​మార్క్ ప్రకటన

ఫావిపిరవిర్ సామర్థ్యం, పనితీరును పరీక్షించడానికి 150 మంది రోగులపై ప్రయోగించారు. ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్​గా తేలిన రోగులను ప్రయోగానికి ఎంచుకున్నారు. మొదటిరోజు 3,600 మి.గ్రాముల ఫావిపిరవిర్ ఔషధాన్ని రోగులకు ఇచ్చారు. అనంతరం 14 రోజుల వరకు రోజుకు 800 మి.గ్రాముల ఔషధాన్ని అందించారు.

"ఫావిపిరవిర్ ఔషధ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రయల్స్​ను వేగంగా నిర్వహిస్తున్నాం. అయితే శాస్త్రీయ నియమాలను పక్కనబెట్టలేదు. ప్రాథమిక ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఫావిపిరవిర్ ఉపయోగించిన రోగుల్లో క్లినికల్ క్యూర్ వేగంగా జరిగింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ ఔషధ ప్రయోగ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. వాటన్నింటినీ పరిశీలించే వరకు సాధారణ తీవ్రత ఉన్న కరోనా రోగులకు ఫావిపిరవిర్ ఉపయోగించవచ్చని ధ్రువీకరించడానికి తగిన ఆధారాలు లభించాయి."

-డా, జరీర్​ ఉద్వాడియా, ప్రధాన పరిశోధకులు

జర్నల్​లో ఫలితాల ప్రకటన!

కరోనా రోగుల తీవ్రతను (తేలికపాటి నుంచి ఓ మోస్తరు) బట్టి ఫావిపిరవిర్​ ఔషధాన్ని ఉపయోగించేందుకు డ్రగ్​ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. అనంతరం గ్లెన్​మార్క్​ ఫార్మా సంస్థ ఈ డ్రగ్ తయారీకి డీసీజీఐ నుంచి అనుమతి తీసుకుంది. ఈ మేరకు 'ఫాబిఫ్లూ' పేరిట ఫావిపిరవిర్ ఔషధాన్ని గ్లెన్​మార్క్ ఆవిష్కరించింది. ఈ క్లినికల్ ట్రయల్స్​కి సంబంధించిన ఫలితాలను త్వరలోనే ప్రధాన జర్నల్​లలో ప్రచురించేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి-'విద్య'లో భారీ మార్పులు.. క్లాస్​రూం నుంచి ఆన్​లైన్​లోకి

ABOUT THE AUTHOR

...view details