మహారాష్ట్రలో రోజురోజుకు రికార్డు సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 23,350 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 328మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 7 వేలు దాటింది.
ఆ జిల్లాలే...
దేశంలో ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 35 జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 17జిల్లాలు, దిల్లీలో 11, పశ్చిమ్ బంగాలోని కోల్‌కతా, హావ్‌డా, 24 ఉత్తర పరగణాలు, 24 దక్షిణ పరగణాలు, గుజరాత్‌లోని సూరత్, పుదుచ్చేరి, ఝార్ఖండ్‌లోని తూర్పు సింహభూమ్ జిల్లాల్లోనే భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరీక్షల సామర్థ్యం పెంచి... సానుకూలత రేటును 5 శాతం లోపు తగ్గించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని కోరింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐదు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.
రికార్డు స్థాయిలో రికవరీ రేటు
ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 73,542 మంది వైరస్ నుంచి కోలుకోవడం వల్ల దేశంలో రికవరీ రేటు 77.32 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 32 లక్షల మంది వైరస్‌ను జయించారు. మరణాలరేటు 1.72 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య ఇలా..
- కర్ణాటకలో కొత్తగా 9,319మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 95 మంది మృత్యువాత పడ్డారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 6,777 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 77 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 66 వేలు దాటింది.
- తమిళనాడులో ఒక్కరోజే 5,783 మంది కరోనా బారిన పడగా.. 88 మంది మృతి చెందారు. 51,458 మంది చికిత్స పొందుతున్నారు.
- ఒడిశాలో ఒక్కరోజులో అత్యధికంగా 3,810 కేసులు నమోదవగా... 8 మంది చనిపోయారు.
- దిల్లీ తాజాగా 3,256 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. 29 మంది మరణించారు.
- బంగాల్లో 3,087 కేసులు వెలుగు చూశాయి. మరో 52 మంది చనిపోయారు.
- కేరళలో కొత్తగా 3,082 మందికి వైరస్ సోకింది. మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బిహార్‌లో కొత్తగా 1,797 కేసులు నమోదయ్యాయి.
- జమ్ముకశ్మీర్‌లో తాజాగా 1,316 కేసులు వెలుగుచూశాయి.
- హరియాణాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడాకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చూడండి:ప్రభుత్వంపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధం!