దేశంలో 1,834కు చేరిన కరోనా కేసులు.. 41 మంది మృతి - కరోనా వైరస్ వార్తలు
దేశంలో కరోనా కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య ఒక్క రోజులోనే 437 పెరిగి 1,834కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 41 మంది మరణించారు. మరోవైపు నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో 6 వేల మందిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఇందులో 5 వేల మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాయి. మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
భారత్‌లో కరోనా
By
Published : Apr 2, 2020, 5:17 AM IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిజాముద్దీన్ మర్కజ్ ఘటనలో పాల్గొన్న వారి కోసం కేంద్ర, రాష్ట్రాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. తబ్లీగీ జమాత్ మతపరమైన కార్యక్రమానికి హజరైన 6 వేల మందిని గుర్తించిన అధికారులు.. అందులో 5 వేల మందిని ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మిగిలిన 2 వేల మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ జాబితాలో ఉన్న విదేశీయులను దిల్లీ సహా పలు ప్రాంతాల్లో గుర్తించారు.
జమాత్‌కు హాజరైన వారిని గుర్తించేందుకు దిల్లీ ప్రభుత్వం, క్రైం బ్రాంచ్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టి 275 మంది విదేశీయులను క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఇండోనేసియా నుంచి 172, కిర్గిస్థాన్ 36, బంగ్లాదేశ్ నుంచి 21 మంది ఉన్నారు.
తబ్లీగీ ఎఫెక్ట్
మరోవైపు దేశంలో వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తబ్లీగీ జమాత్ కార్యక్రమం కారణంగానే వైరస్ కేసుల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 1,834 కరోనా కేసులను ధ్రువీకరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 143 మంది కోలుకున్నట్లు తెలిపింది. వైరస్ కారణంగా మొత్తం 41 మంది మరణించినట్లు స్పష్టం చేసింది. దేశంలో 24 గంటల్లోనే 437 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీల్లో ఎక్కువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిజాముద్దీన్‌కు హాజరైన 53 మంది సహా దిల్లీలో మొత్తం 152 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో కొత్తగా 33 కేసులు నమోదు కావడం వల్ల.. రాష్ట్రంలో కేసులు 335కి చేరాయి. కొత్తగా నమోదైన 33 కేసుల్లో 30 కేసులను ముంబయిలోనే గుర్తించడం గమనార్హం. దాదాపు 5,000 మంది క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మర్కజ్‌కు ఏయే రాష్ట్రం నుంచి ఎంతమంది
తబ్లీగీ కార్యక్రమానికి హాజరైన వారిని రాష్ట్రాలు గుర్తించే పనిలో ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కొవిడ్ లక్షణాలు బయటపడితే ఆస్పత్రులకు తరలిస్తున్నారు అధికారులు. లక్షణాలు కనిపించనివారిని నిర్బంధంలో ఉంచుతున్నారు. తమిళనాడు, గుజరాత్ నుంచి అత్యధికంగా 1,500 మంది నిజాముద్దీన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.
వివిధ రాష్ట్రాల నుంచి తబ్లీగీకి హాజరైన వారి లెక్కలు
రాష్ట్రం
హాజరైనవారు
తమిళనాడు
1,500(సుమారుగా)
గుజరాత్
1,500(నిజాముద్దీన్‌ను సందర్శించినవారు)
తెలంగాణ
1,000కిపైగా
ఉత్తర్‌ప్రదేశ్
569
హరియాణా
503
మహారాష్ట్ర
252
హిమాచల్ ప్రదేశ్
167
మధ్యప్రదేశ్
107
ఛత్తీస్‌గఢ్
101
బిహార్
81
పశ్చిమ బంగాల్
71
ఒడిశా
4
అరుణాచల్ ప్రదేశ్
1
ఛీ.. ఛీ..
నిజాముద్దీన్‌లో కార్యక్రమానికి హాజరైన వారిని ప్రభుత్వాలు నిర్బంధంలో ఉంచుతున్నాయి. అయితే క్వారంటైన్లో ఉన్న కొందరు వైద్యుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆగ్నేయ దిల్లీ రైల్వే క్వారంటైన్ యూనిట్లో ఉన్న జమాత్ ప్రతినిధులు.. చికిత్స అందిస్తున్న సిబ్బందిపై ఉమ్మేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిజాముద్దీన్ మర్కజ్ నుంచి ఈ క్వారంటైన్ కేంద్రానికి 167 మందిని తరలించారు అధికారులు.
"క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారు సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. వారికి అందిస్తున్న ఆహారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారికి చికిత్స చేయడానికి వచ్చిన వైద్యులపై ఉమ్మేశారు. చుట్టుపక్కల తిరగకూడదన్న అభ్యర్థనను వినిపించుకోవడం లేదు. ఇక్కడి నుంచి వేరేచోటుకు వారిని తరలించాలని రైల్వే డీఎంకు అభ్యర్థించాం. దిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవానులను క్వారంటైన్ కేంద్రాల వద్ద మోహరించాం."-దీపక్ కుమార్, రైల్వే అధికారి.
మరోవైపు క్వారంటైన్ కేంద్రాలు ఉన్న కాలనీ వాసులు వైరస్ సోకే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్ కేంద్రాల్లోకి తీసుకొచ్చి 24 గంటలు గడుస్తున్నా.. కాలనీల్లో పారిశుద్ధ్య చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.