దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రికవరీల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరోవైపు కరోనా మరణాల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.
భారత్‌లో కరోనా మరణాల రేటు ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ రేటు 2.23గా ఉందని, ఏప్రిల్ 1 తర్వాత ఇదే అత్యల్పమని పేర్కొంది.
"మరణాల రేటు తక్కువగా ఉంచడమే కాక, సమగ్ర సంరక్షణ విధానం, సమర్థమైన నియంత్రణ వ్యూహం, అధిక పరీక్షలు, ప్రామాణిక క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లను విజయవంతంగా అమలు చేయడం వల్ల రికవరీలు పెరుగుతున్నాయి. వరుసగా ఆరు రోజుల పాటు రోజుకు 30 వేల మందికి పైగా కోలుకున్నారు."