కరోనాపై అలుపు లేకుండా పోరాడాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ మహమ్మారిపై ఐకమత్యంతో పోరాడి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. బౌద్ధ పూర్ణిమ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని.. ప్రస్తుత పరిస్థితులు వేడుకలు చేసుకునేందుకు అనువుగా లేవని వ్యాఖ్యానించారు.
తన సిద్ధాంతాలతో బుద్ధుడు ఎందరికో మార్గనిర్దేశకంగా నిలిచారని అన్నారు మోదీ. మానవాళి శ్రేయస్సు కోసం బుద్ధుడు చేసిన బోధనలను గుర్తుచేశారు. బుద్ధుని మార్గంలోనే పయనించి భారతదేశం ఎలాంటి వివక్ష చూపకుండా ప్రపంచదేశాలకు మద్దతుగా ఉంటోందని అన్నారు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా.. భారత్ తోడుంటుందని వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వృద్ధి ఎల్లప్పుడూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉంటుందని అన్నారు మోదీ.
గౌరవానికి వారే అర్హులు...
కరోనా లాక్డౌన్లోనూ దేశ ప్రయోజనాల కోసం నిత్యం శ్రమిస్తున్నవారే నిజమైన పోరాటయోధులని ప్రశంసించారు మోదీ. వారికే గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డారు.
''కరోనా లాక్డౌన్తో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. చాలా మంది ఇతరులకు సాయం చేసేందుకు 24 గంటలు శ్రమిస్తున్నారు. వారి సౌకర్యాలను వదులుకొని నిస్వార్థంగా.. శాంతి భద్రతల పర్యవేక్షణ, కరోనా బాధితులకు చికిత్స చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చేస్తున్నారు. అలాంటి వారికే ప్రశంసలు దక్కాలి. వారికే సరైన గౌరవం ఇవ్వాలి. ''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
బుద్ధ జయంతి సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమాఖ్య సంయుక్తంగా.. వైరస్ బాధితులు, కరోనా యోధులకు గౌరవ సూచనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
వేసక్ బుద్ధ పూర్ణిమ వేడుకలను మూడు దీవెనల రోజుగా బౌద్ధమతంలో వ్యవహరిస్తారు. ఈ రోజే బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహా పరినిర్వాణగా పిలిచే మరణం సంభవించాయని బౌద్ధుల విశ్వాసం.