కరోనా... మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేసింది. మహమ్మారుల సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియచెప్పింది. అందుకే.. కొవిడ్-19 వంటి మహమ్మారులతో తలెత్తే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యులను సిద్ధం చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఎంసీఐ).. ఎంబీబీఎస్ కోర్సులో కొత్త మాడ్యూల్‌ను ప్రవేశపెట్టింది.
ఇకపై వైద్య విద్యార్థులు.. ఎంబీబీఎస్ కోర్సులో మహమ్మారుల నిర్వహణ (పాండమిక్ మేనేజ్మెంట్) తోపాటు దాని ద్వారా ఎదురయ్యే సామాజిక, చట్టపరమైన, ఇతర సమస్యలను సమర్థంగా ఎదుర్కోవటం గురించి నేర్చుకోనున్నారు.
ఎంబీబీఎస్‌లోని తొలి ఏడాది నుంచి చివరి సంవత్సరం వరకు ఈ మాడ్యూల్ ఉండనుందని భావిస్తున్నట్లు ఎంసీఐలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ పేర్కొన్నారు.
" ఎంబీబీఎస్ విద్యార్థులు రోగాలను మాత్రమే కాకుండా మహమ్మారుల నుంచి ఉత్పన్నమయ్యే సామాజిక, చట్టపరమైన, ఇతర సమస్యలను కూడా సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యాలను పొందేలా ఈ మహమ్మారి నిర్వహణ మాడ్యూల్ రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్-19.. మన విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని మరింత నొక్కి చెప్పింది. భారతీయ వైద్యులు... డాక్టర్‌గా, సంభాషణకర్తగా, నాయకుడిగా, ఆరోగ్య సంరక్షణ బృందం సభ్యునిగా విభిన్న పాత్రలను పోషించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.