కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత.. కొవిడ్-19పై వార్తలు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. ప్రసారమైన వార్తల్లో 42.2 శాతం ముఖ్యాంశాలు వైరస్ గురించే వచ్చినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయ నాయకుల్లో మోదీ అతిపెద్ద న్యూస్ మేకర్‌గా స్థానం దక్కించుకున్నట్లు వివరించింది.
కృత్రిమ మేధ సాయంతో..
పీఆర్ఎమ్ ఫిన్కాన్ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో.. బోటిక్ బ్రాండ్- బిల్డింగ్‌కు చెందిన ధర్మ మీడియా కన్సల్టెంట్స్ ఈ అధ్యయనం చేసింది. మార్చి 1 నుంచి మే 10 తేదీల మధ్య ప్రసారమైన 15 ప్రధాన వార్తల్లో.. 75 వేల ముఖ్యాంశాలను కృత్రిమ మేధస్సు ద్వారా విశ్లేషించారు. లాక్డౌన్ ముందు కరోనాకు సంబంధించి 24.5 శాతం వార్తలు ప్రసారమవగా.. లాక్డౌన్ తొలి రెండు దశల్లో అది కాస్తా 42.2 శాతానికి పెరిగినట్లు తెలిపారు. అయితే, మూడో దశ తొలి వారం( మే10 వరకు) వైరస్ వార్తల సంఖ్య 32 శాతానికి పడిపోయినట్లు వివరించారు.
న్యూస్ మేకర్‌గా మోదీ...
దేశంలోని రాజకీయ నాయకుల్లో అతిపెద్ద న్యూస్ మేకర్‌గా మోదీ నిలిచినట్లు అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత స్థానంలో రాహుల్ గాంధీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఉన్నట్లు పేర్కొంది.
పలు రంగాల్లో స్థానాలు దక్కించుకున్నవారు....
- రాష్ట్రస్థాయి నాయకుల్లో (కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన నేపథ్యంలో) న్యూస్ మేకర్‌గా నిలిచారు జ్యోతిరాదిత్య సింథియా.
- ఆ తర్వాత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రె, మమతా బెనర్జీ వరుస స్థానాలు కైవసం చేసుకున్నారు.
- ఇక ప్రధానంగా గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వెబ్సైట్లలో కరోనా సంబంధిత వార్తలు అధికంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
- లిస్టెడ్ కంపెనీల్లో ఎస్‌బ్యాంక్ తొలిస్థానంలో నిలిచింది.
- ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టడం వల్ల జియో.. అన్‌లిస్టెడ్ బ్రాండ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రియల్-మి, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీలు వరుస స్థానాలు దక్కించుకున్నాయి.
- సినీ తారల్లో ఇటీవలే మరణించిన రిషికపూర్, ఇర్ఫాన్ ఖాన్లు ప్రథమ స్థానంలో నిలిచారు. కరీనాకపూర్, అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ తర్వాత ర్యాంక్‌ల్లో ఉన్నారు.
- 2020 టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల క్రీడల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఐపీఎల్ గురించి ఎక్కువ వార్తలు వచ్చాయి.
- అంతర్జాతీయ వార్తల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిస్థానం దక్కించుకోగా... ఐక్యరాజ్యసమితి, వాల్ స్ట్రీట్, అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడి స్థానానికి పోటీపడుతున్న జో బిడెన్, బోరిస్ జాన్సన్( బ్రిటన్ ప్రధాని) వరుస స్థానాల్లో నిలిచారు.
మే 17 నుంచి మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది భారత ప్రభుత్వం. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించే క్రమంలో.. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.