దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర సహా దేశ రాజధాని దిల్లీలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఆదివారం 3,870 కేసులు నమోదయ్యాయి. దిల్లీలో వరుసగా మూడో రోజు వైరస్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. దేశ రాజధానిలో వైరస్ కేసుల సంఖ్య 60 వేలకు చేరువైంది. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో 500కుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.
దిల్లీలో 60వేలకు చేరువలో కరోనా కేసులు
By
Published : Jun 21, 2020, 10:50 PM IST
భారత్‌ను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. అన్‌లాక్-1లో వైరస్ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో తాజాగా 3,870 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,075కు చేరింది. 101 తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,170కి పెరిగింది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో ఆదివారం 3 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్ బాదితుల సంఖ్య 59,746కు చేరింది. దిల్లీలో 3,000కుపైగా కేసులు వెలుగుచూడటం వరుసగా ఇది మూడోసారి. ఆదివారం మరో 63 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,175కు పెరిగింది.
గుజరాత్లో ఉద్ధృతం...
గుజరాత్లో తాజాగా 580 మంది కరోనా బారిన పడ్డారు. 25 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,317కు.. మరణాల సంఖ్య 1,664కు చేరింది.
బంగాల్ విలవిల...
వైరస్ ధాటికి బంగాల్ విలవిలలాడుతోంది. ఈరోజు 414 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,495 మంది కరోనా బారినపడ్డారు. తాజాగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 555కు చేరింది.