దిల్లీ జైళ్లలోని ఖైదీలు కొవిడ్ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఖైదీలందరికీ తరచూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం సహా.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, హోమియోపతి మందులు ఇస్తున్నామని చెప్పారు.
70 మంది జైలర్లకు ప్రత్యేక శిక్షణ..
హోమియోపతి మందుల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జైలు విభాగం తెలిపింది. అందులో భాగంగా రెండు నెలలకోసారి మందులు ఇస్తున్నామని స్పష్టం చేసింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మరసం, విటమిన్-సి కలిగిన పండ్ల రసాలు అందిస్తున్నామని తెలిపింది. ఖైదీల యోగక్షేమాలను చూసుకునేందుకు.. 70 మంది సిబ్బందికి సైకాలజిస్టులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని పేర్కొంది జైలు శాఖ.