దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మొత్తం 16 వేల 116 మంది కరోనా బారినపడ్డారు. శనివారం సాయంత్రం నుంచి కొత్తగా 1324 మందికి వైరస్ సోకింది. మరో 31 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 519కి చేరింది. బాధితుల్లో ఇప్పటివరకు 2301 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 13, 295గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
అయితే.. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేల 615గా ఉంది. మొత్తం 4,01,586 నమూనాలను పరీక్షించినట్లు స్పష్టం చేసింది. పరీక్షించిన వారిలో సగటున 4.58 శాతం మందికి వైరస్ సోకినట్లు తేలింది.
మహారాష్ట్ర, గుజరాత్లలో తీవ్రం..
ఆదివారం నమోదైన 31 మరణాల్లో గుజరాత్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 10 మంది చొప్పున ఉన్నారు. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్లో ముగ్గురు చొప్పున, బంగాల్లో ఇద్దరు, దిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం మృతుల్లో 211 మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ (70), గుజరాత్ (58), దిల్లీ(43) మరణాలతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
7 రాష్ట్రాల్లో 1000 ప్లస్...
కేసుల పరంగా చూస్తే 7 రాష్ట్రాల్లో 1000కిపైగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో 3651, దిల్లీలో 1893, గుజరాత్లో 1604, మధ్యప్రదేశ్లో 1407, తమిళనాడులో 1372 మంది బాధితులున్నారు. రాజస్థాన్లో 1351, ఉత్తర్ప్రదేశ్లో 1084 మందికి వైరస్ సోకింది.