మహమ్మారి కరోనాను ఎదుర్కోడానికి ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అధికారులు, నాయకులు, గవర్నర్లు తమ నెల జీతాలను విరాళాలుగా ప్రకటిస్తున్నారు . కొన్ని రాష్ట్రాల్లో పేద ప్రజలకు సహాయంగా భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
మూడు నెలల జీతం
కరోనా సంక్షోభం నుంచి బయట పడటానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రజలు తమ వంతు సాయంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. వైరస్‌పై అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.
విరాళంగా నెలజీతం
పంజాబ్ కెబినేట్ మంత్రులు ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. శిరోమని అకాళీ దళ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ ఐఏఎస్ అధికారులు కూడా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
రాజస్థాన్ సీఎం కరోనా ప్యాకేజి
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రూ.2వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. దీని ద్వారా 1.41కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.