విద్యార్థుల పాఠ్య ప్రణాళికా భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9-12 తరగతుల పాఠ్యప్రణాళికను హేతుబద్ధీకరించామని సీబీఎస్‌ఈ తెలిపింది. దాదాపు 30శాతం వరకు సిలబస్ తగ్గించామని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
కొవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్‌లాక్-2 నడుస్తున్నప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. రోజుకు 20వేల కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల విద్యా సంస్థలు తెరిచేందుకు పరిస్థితులు అనువుగా లేవు. అసలు విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పష్టత లేదు.