ప్రాణాంతక కరోనాను వినూత్నమైన పరిష్కార మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్‌ను 'జీవితకాల సవాల్'గా అభివర్ణించారు ప్రధాని. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు మోదీ.
"రిపోర్టర్లు, కెమెరామెన్లు, టెక్నీషియన్ల విరామం లేని కృషి దేశానికి గొప్ప సేవ వంటిది. సరైన కమ్యూనికేషన్ ద్వారా ప్రజల్లోని నిరాశావాదం, భయాన్ని మీడియా తొలగించాలి. కొవిడ్-19 అనేది జీవితకాల ముప్పు. దీన్ని సరికొత్త, వినూత్న పరిష్కారాల ద్వారా ఎదుర్కోవచ్చు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కరోనా వైరస్ తీవ్రతను అర్థం చేసుకొని... వైరస్‌పై అవగాహన పెంచడంలో మీడియా చేసిన కృషిని మోదీ కొనియాడారు. సుదీర్ఘమైన ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తాజా సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. మీడియా అందించే సమాచారం ప్రభుత్వానికి సైతం కీలకమైన ఫీడ్బ్యాక్లా ఉంటుందన్నారు. శాస్త్రీయమైన రిపోర్టులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రిపోర్టర్లకు ప్రత్యేకమైన మైకులు ఇచ్చి... మీటరు దూరం పాటిస్తూ ముఖాముఖి తీసుకోవాలని సూచించారు.