వివాదాలను పరిష్కరిస్తూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పులు సహేతుకంగా, స్పష్టంగా ఉండాలని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్-31(3) ప్రకారం అవార్డు జారీ చేయని పక్షంలో సెక్షన్-34 కింద జోక్యం చేసుకుని వాటిని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుందని పేర్కొంది. స్పష్టమైన కారణాలున్నప్పుడు.. సంక్షిప్త తీర్పులు ఇచ్చే అవకాశం మధ్యవర్తిత్వ ట్రైబ్యునళ్లకు ఉందని తెలిపింది. తద్వారా సమయం వృథా కాకుండా చూడొచ్చని వెల్లడించింది. అయితే, ట్రైబ్యునళ్లు రికార్డులన్నింటినీ చదవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమని సూచించింది. డైనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్ కేసులో జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ రస్తోగి, జస్టిస్ శాంతన గౌడర్‌లతో కూడిన ధర్మాసనం విప్లవాత్మక తీర్పు వెలువరిస్తూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
సుదీర్ఘ తీర్పు అవసరం లేదు
ట్రైబ్యునళ్ల తీర్పులు సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. క్లుప్తంగా అయినప్పటికీ, స్పష్టంగా ఉండాలని సూచించింది. ట్రైబ్యునళ్ల తీర్పులు అర్థవంతంగా ఉన్నప్పుడు.. కారణాలు పేర్కొనలేదంటూ జోక్యం చేసుకోరాదని కోర్టులకు హితవు పలికింది. డైనా టెక్నాలజీస్ దాఖలు చేసిన సివిల్ అపీలులో సహేతుకత, స్పష్టత లేకుండా గజిబిజిగా ఉన్న మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. ట్రైబ్యునళ్ల అవార్డుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌లో కేసు కోల్పోయిన వ్యక్తి తిరిగి కోర్టు ముందు కేసు పూర్వాపరాలపై వాదించడం అనైతిక చర్య అని ధర్మాసనం అభిప్రాయపడింది.
కారణాలు లేవని రద్దు చేయొద్దు
ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికి సెక్షన్-34 కింద కొన్ని పరిమితులున్నాయని తెలిపింది. సరైన కారణాలు పేర్కొనకపోవడం కూడా అందులో ఒకటంది. తీర్పుల్లో గందరగోళం, అస్పష్టత లేకపోయినా.. సరైన కారణాలు లేవని పేర్కొంటూ వాటిని రద్దు చేయొద్దని కోర్టులకు గుర్తుచేసింది. రొయ్యల చెరువు తవ్వక ఒప్పందం కుదుర్చుకొని మధ్యలో రద్దు చేసుకోవడంతో డైనా టెక్నాలజీస్‌కు రూ.30 లక్షలను 8 వారాల్లో చెల్లించాలంటూ క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్‌ను ఆదేశిస్తూ 25 ఏళ్ల వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. గడవులోగా చెల్లించకపోతే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.