అబుధాబిలో మరణించిన ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని తిప్పిపంపటంపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతదేహాన్ని అప్పగించేందుకు అతడి కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా హోంశాఖ ఎందుకు నిరాకరించిందని ప్రశ్నించింది.
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌కు చెందిన కమలేశ్ భట్.. అబుధాబికి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడే ఓ సంస్థలో పనిచేస్తున్న అతడు.. ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి సాయంతో స్వదేశానికి అతడి మృతదేహాన్ని భారత్‌కు రప్పించారు. లాక్డౌన్ నిబంధనలు నేపథ్యంలో గంటల వ్యవధిలో అబుధాబికే మృతదేహాన్ని తిప్పి పంపేశారు భారత అధికారులు.
అధికారుల తీరుపై కమలేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమలేశ్ మృతదేహానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటన్నదీ తెలియకుండా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కమలేశ్ సోదరుడు విమలేశ్ భట్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మృతదేహాన్ని ఇచ్చేందుకు తిరస్కరించిన ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేశారు.
అత్యవసర విచారణ..
విమలేశ్ వ్యాజ్యంపై జస్టిస్ సంజీవ్ సచ్దేవ నేతృత్వంలోని ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. అన్ని అనుమతులు ఉన్నా అధికారులు తిరస్కరించి.. అదే విమానంలో తిప్పిపంపడమేమిటని ప్రశ్నించింది.
సంబంధిత రాయబార కార్యాలయం సాయంతో మృతదేహం ఎక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుంటామని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ ఆచార్య తెలిపారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో చర్చించిందని కోర్టుకు విన్నవించారు.
ఇటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలనూ రూపొందించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.