2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకునే అంశంపై దోషుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక వారం గడువునిస్తూ.. తిహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ పటియాల హౌస్ కోర్టు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్పునిచ్చిన నేపథ్యంలో దిల్లీ కోర్టు ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
దోషులకు ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని నిర్భయ తల్లి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టారు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా. డెత్ వారెంట్ ఇవ్వాలని నిర్భయ తల్లి తరఫున న్యాయవాది జడ్జిని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం... తిహార్ జైలు అధికారులకు తాఖీదులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
నిర్భయ తల్లి కన్నీరు...
విచారణ సమయంలో నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'మేము వెళ్లిన ప్రతి చోట... ఊరట పొందేందుకు తమకు న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని వారు(దోషులు) అంటున్నారు. ఏంచెయ్యాలి?' అని నిర్భయ తల్లి అంటూ కన్నీరు పెట్టుకున్నారు.