తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాను నియంత్రించగలమనే ధైర్యం వచ్చింది' - corona deaths

అమెరికా న్యూయార్క్​పై తీవ్ర ప్రభావం చూపిన కరోనా కాస్త శాంతించింది. ఇటీవల ఆ రాష్ట్రంలో ఆసుపత్రిలో చేరేవారు, ఐసీయూలో చికిత్స పొందే వారి సంఖ్య 15 శాతం తగ్గింది. అయితే ఈ మహ్మమ్మారి అంత తేలిగ్గా తీసుకొనే జబ్బుకాదని, ప్రస్తుతం న్యూయార్క్​లో వస్తున్న మార్పులు చూస్తుంటే కరోనాను నిరోధించగలమనే నమ్మకం కలిగిందని ప్రముఖ క్యాన్సర్​ వైద్య నిపుణుడు పద్మశ్రీ నోరీ దత్తాత్రేయుడు అభిప్రాయపడ్డారు.

'Courage to be able to control Corona' Oncologist Padmashri Nori dattatreyudu
'కరోనాను నియంత్రించగలమనే ధైర్యం వచ్చింది'

By

Published : Apr 10, 2020, 6:31 AM IST

గత మూడు రోజులుగా న్యూయార్క్‌లో పరిస్థితులను గమనిస్తే కరోనాను ఎదుర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఆసుపత్రిలో చేరేవారు, ఐసీయూలో చికిత్స పొందే వారు, వెంటిలేటర్‌ మీదకు వెళ్లే వారి సంఖ్య 15 నుంచి 20 శాతం వరకు తగ్గింది. ఇది ఓ మంచి పరిణామం. వ్యక్తిగత దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం ఇందుకు కారణమని అమెరికాలోని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు అభిప్రాయపడ్డారు. ఇది తేలిగ్గా తీసుకొనే జబ్బుకాదని పేర్కొన్నారు. ఈయన భార్య, కుమార్తె కూడా న్యూయార్క్‌లోని వేర్వేరు ఆసుపత్రుల్లో వైద్యసేవలందిస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో కొత్త కేసులు తగ్గడం వల్ల కరోనాను నిరోధించగలమనే నమ్మకం కలిగిందని ఆయన 'ఈనాడు ప్రత్యేక ప్రతినిధి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

క్యాన్సర్​ వైద్య నిపుణుడు, పద్మశ్రీ నోరీ దత్తాత్రేయుడు

న్యూయార్క్‌లో ఎక్కువ మరణాలు

కరోనా వైరస్‌ తీవ్రత వల్ల న్యూయార్క్‌లో ఎక్కువ మంది చనిపోయారు. ఇక్కడ టవర్లను కూల్చినపుడు 2,400 మంది చనిపోతే కరోనా వల్ల ఇప్పటికే ఆరువేల మందికి పైగా మరణించారు. గతంలో ఆస్పత్రుల్లో చేరిన వారిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ఐసీయూ చికిత్స పొందేవారు, ఆసుపత్రుల్లో చేరేవారు తగ్గారు. చాలా మంది వైద్యులు కూడా కరోనా బారిన పడ్డారు. న్యూయార్క్‌లో జనసాంద్రత ఎక్కువ. అంతర్జాతీయ ప్రయాణికులూ ఎక్కువే. అందుకే ఇక్కడ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. తాజాగా కరోనా సోకే వారి సంఖ్య గత మూడు రోజులుగా పైపైకి వెళ్లకపోవడం ఊరట కల్గించే పరిణామం. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యే వారి సంఖ్య కూడా పెరగడం గమనించాల్సిన అంశం. అయితే జబ్బులున్నవాళ్లు, పొగతాగే అలవాటున్నవారు, ఆస్తమా ఉన్నవారు, రోగనిరోధక శక్తి లేనివాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అంటే కరోనాను ఎదుర్కోవడంలో ప్రజల బాధ్యతే ఎక్కువగా ఉంది. మరోవైపు వ్యాక్సిన్‌, యాంటి వైరల్‌ డ్రగ్స్‌పైన విస్తృతంగా పరిశోధన జరుగుతుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో వేల మంది శాస్త్రవేత్తలు 24 గంటలూ ఇదే పనిలో ఉన్నారు. వైరస్‌ సోకి బయటపడిన వారి నుంచి సిరం తీసుకొని ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న వారికి ఎక్కించే ప్రక్రియపై కూడా కసరత్తు జరుగుతుంది.

భారత్‌లో మరింత జాగ్రత్త అవసరం

బయటి దేశాల అనుభవాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని భారత్‌ మరింత జాగ్రత్తగా ఉండాలి.దేశంలో కరోనా ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అయితే ఇక్కడ జనాభా ఎక్కువ. పైగా చేసే పరీక్షలు తక్కువ. అందుకే ప్రభుత్వం ఏం చేయాలని చెబుతుందో దానిని ప్రజలు ఆచరించాలి. ప్రజలు సరిగా అర్థం చేసుకోకపోతే అదుపులోకి తేవడం సాధ్యం కాదు. భారతీయ వైద్యులు ముందుండి ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యాధి బారిన కూడా పడుతున్నారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలి. భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడం మంచి నిర్ణయం. అన్ని అంశాలను గమనించి వ్యక్తిగత దూరం, మాస్క్‌లు ధరించడం, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండటం చేయాలి.

ABOUT THE AUTHOR

...view details