తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'పోరు: గురువారమే ఫలితం- భాజపా జైత్రయాత్ర ఖాయమా? - దేవేంద్ర ఫడణవీస్​ మళ్లీ గెలుస్తారా..

అక్టోబర్​ 21న నిర్వహించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురువారం ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందా.. కాంగ్రెస్​-ఎన్సీపీలు సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంటాయా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

రేపే కౌంటింగ్​.. 'మహా'లో మళ్లీ భాజపా జైత్రయాత్రేనా..!

By

Published : Oct 23, 2019, 6:09 PM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.గురువారం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్​ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితంపై స్పష్టత రానుంది.

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి... 3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలోని 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లలో 60.46 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్​రూంల పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరాఠా గడ్డపై వరుసగా రెండోసారి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తోన్న భాజపా... ఈసారి మిత్రపక్షం శివసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. భాజపా 164, సేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మరోవైపు పునఃవైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీ పొత్తుతో పోటీ చేశాయి. కాంగ్రెస్‌147, ఎన్సీపీ 121 చోట్ల బరిలోకి దిగాయి. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన 101 స్థానాల్లో, బీఎస్పీ 262 స్థానాల్లో పోటీ చేయగా.. 1400 మందికిపైగా స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ప్రముఖుల భవితవ్యం ఏంటో...

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నాగ్‌పూర్‌ నైరుతి స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌నేత, మాజీ సీఎం అశోక్‌చవాన్‌.... భోకార్‌ నుంచి, మరో కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ కారాడ్‌ దక్షిణ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు యువసేన చీఫ్‌ ఆదిత్య ఠాక్రే ముంబయిలోని వర్లీ నుంచి పోటీ చేశారు. ఠాక్రే కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఎగ్జిట్​ పోల్స్ భాజపాకే పట్టం...

2014 ఎన్నికల్లో భాజపా 122 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్‌ 42, ఎన్సీపీ 41 చోట్ల నెగ్గాయి.

అయితే.. ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు కమలదళానికి అనుకూలంగా ఉన్నాయి. భాజపా-శివసేన కూటమిదే విజయమని ఘంటాపథంగా చెప్పాయి. మహారాష్ట్రలో మూడింట రెండొంతులకుపైగా సీట్లు నెగ్గుతుందని అంచనాలున్నాయి. కాంగ్రెస్​ సహా ఇతర పక్షాలకు ఏ మాత్రం అవకాశాల్లేవని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం వెలువడే ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:మరోమారు భాజపానే.. ఎగ్జిట్​పోల్స్​ అంచనా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details