ఇతరుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖానికి మాస్కులు ధరించాలని కొంతమంది నిపుణులు ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజలు కూడా విరివిగా ముసుగులను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ పరికరాల నిల్వలు నిండుకుంటున్నాయి. వైద్య సిబ్బందికి మాస్కుల లభ్యత తగ్గుతోంది.
వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు శ్వాసకోశ బిందువులు బయటకు వస్తాయి. వీటి ద్వారా ఎదుటివారికి వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మాస్కులు, ఇతర రక్షణ పరికరాలు వైరస్ వ్యాప్తి జరగకుండా నియంత్రిస్తాయి. అయితే మాస్కులు ఎవరు వాడాలి.. ఎలాంటి మాస్కులు వాడాలన్న విషయంలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవి సరిపోతాయి..
ప్రతి ఒక్కరు ధరిస్తేనే మాస్కుల వల్ల ఫలితం ఉంటుందని బర్మింగ్హమ్ విశ్వవిద్యాలయ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కేకే చెంగ్ అంటున్నారు. అయితే ఇందుకు సాధారణ మాస్కులు సరిపోతాయని చెబుతున్నారు. ఎందుకంటే.. ఓ టిష్యూ పేపర్ కూడా ఈ తుంపర్లను నిలుపుదల చేయగలవని తెలిపారు. మరికొందరు నిపుణులు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తంచేశారు.
"ఇంట్లో తయారుచేసిన ముసుగులు వ్యాధి సంక్రమణను తగ్గిస్తాయో లేదో స్పష్టంగా చెప్పలేం. ఈ అంశంపై చాలా తక్కువ శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. అయినప్పటికీ ఇవీ మంచి ఫలితాల్నే ఇస్తాయి."
- బెంజమిన్ కౌలింగ్, అంటువ్యాధుల నిపుణుడు
చివరి ప్రయత్నం..
ఇన్ ఫ్లుయెంజా మహమ్మారి సమయంలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం మాస్కులపై 2013లో ఓ అధ్యయనం చేసింది. టీ-షర్టుల నుంచి మాస్కులను తయారు చేసే పనిని వలంటీర్లకు అప్పగించింది. ఈ అధ్యయనం ద్వారా ఇంట్లో తయారు చేసిన మాస్కులు సంక్రమణను తగ్గిస్తాయని.. కానీ ప్రమాదాన్ని నివారించలేవని గుర్తించింది.