గాడిద పాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులు చూశారా! మంచి ఆదాయాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఓ ఐటీ నిపుణుడు సరికొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలోకి దూకాడు. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేస్తూ వ్యాపారంలో సరికొత్త ఒరవడిని సృష్టించి చక్కని విజయాన్ని సాధించాడు. ఆయనే కేరళ ఎర్నాకుళంకు చెందిన ఐటీ నిపుణుడు అబీ బేబీ.
సరికొత్త ఒరవడితో..
బేబీ బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. వ్యాపార రంగంలోకి రావాలనే కోరికతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. అందరికంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో ఎర్నాకుళం జిల్లాలోని రామమంగళంలో తన సొంత పొలంలో మూడు సంవత్సరాల క్రితం 21 గాడిదలతో 'డాల్ఫిన్ ఐబీఏ' ఫాంను ఏర్పాటుచేశారు. ఇందులో పొయిటౌ రకానికి చెందిన ఆరు ఫ్రెంచ్ గాడిదలు, ఓ గుజరాతీ హిల్లరీ గాడిద ఉన్నాయి.
ఎన్ఆర్సీసీలో శిక్షణ
అబీ బేబీ రాజస్థాన్ బికనీర్‌లోని ఎన్ఆర్సీసీలో నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నారు. గాడిద పాలతో ఫెయిర్‌నెస్ క్రీమ్, ఫేషియల్ కిట్, స్కిన్ క్రీమ్, హెయిర్ జెల్లను తయారుచేసి, ఆ ఉత్పత్తులను డాల్ఫిన్ ఐబీఏ ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయించడం మొదలుపెట్టారు.
"మేము ఫ్రీజ్ లైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ పాలతో చేసిన ఉత్పత్తుల ద్వారా ట్రైస్ ఎలిమెంట్స్, విటమిన్లు, మినరల్స్ అందిస్తున్నాం. ఆరోగ్యవంతమైన చర్మ సౌందర్యం కోసం లేపనాలుగా క్రీమ్‌లను అందిస్తున్నాం. అలాగే లోనికి తీసుకోవడానికి గాడిద పాలతో ఆహార పదార్థాలనూ అందిస్తున్నాం." - అబీ బేబీ, డాల్ఫిన్ ఐబీఏ ఫాం వ్యవస్థాపకుడు
విజయం సాధించారు..
భారత్‌లో గాడిదలంటే చిన్న చూపు ఉండడం మూలాన మొదట్లో అందరూ.. బేబీని ఎగతాళి చేసేవారు. అయితే వాటిని ఏనాడూ పట్టించుకోని బేబీ. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు తయారుచేయవచ్చని నిరూపించాడు. ఫలితంగా ఆయన తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి... ప్రపంచ స్థాయిలో విజయం సాధించాయి. అబీ బేబీ కృషిని గుర్తించిన భారతీయ వ్వయసాయ పరిశోధన సంస్థ ఈ ఏడాది ఆయనకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డును అందించింది.
అమెరికా, యూరప్‌ల నుంచి..
బేబీ ఫాంలో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులకు అమెరికా, యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని అబీ బేబీ చెబుతున్నారు. ఇప్పుడు గాడిద పాలతో సబ్బులు, లిప్ బామ్లనూ ఉత్పత్తి చేయాలని బేబీ యోచిస్తున్నారు.
ఇదీ చూడండి:అక్టోబర్‌లో రికార్డు స్థాయికి.. యూపీఐ లావాదేవీలు