భారత్-చైనా మధ్య నాలుగో విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు లద్దాఖ్‌లోని త్రిశూల్‌లో జరుగుతున్నాయి. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కీలక ప్రదేశాల నుంచి ఇప్పటికే బలగాలను ఉపసంహరించుకున్నాయి ఇరు దేశాలు. గత చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను పూర్తి స్థాయిలో విరమించుకుని మునపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పే విషయంపై చర్చించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు.
పరస్పర అంగీకారం మేరకు మొదటి విడత బలగాల ఉపసంహరణలో భాగంగా గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పెట్రోలింగ్ పాయింట్-15, ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతాల నుంచి 2 కీ.మీ మేర సైనికులను వెనక్కి మళ్లించింది చైనా. భారత్ కూడా తమ బలగాలను వెనక్కి రప్పించింది.