తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని కరోనా విలయం-ముంబయి, దిల్లీల్లో కలవరం

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, దిల్లీల్లో వేగంగా ప్రబలుతోంది. తమిళనాడులో ఏకంగా 716 కొత్త కేసులు నమోదయ్యాయి. హిమాచల్​ప్రదేశ్​లో ఓ కానిస్టేబుల్​కు కరోనా సోకగా.. పోలీస్ స్టేషన్​ను పూర్తిగా సీజ్ చేశారు అధికారులు. విదేశాల నుంచి వస్తున్న వారితో కేరళలో మళ్లీ కరోనా విస్తరిస్తోంది.

By

Published : May 12, 2020, 10:58 PM IST

corona
కరోనా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రమాదకరంగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 70,756‬గా ఉంది. 46,008 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,454 మంది డిశ్చార్జి అయ్యారు. 2293 మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర, దిల్లీలో వైరస్ తీవ్రమవుతోంది. ముంబయిలో ఇవాళ 28మంది మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 556కి చేరింది. కొత్తగా 426 కేసులతో నగరంలో కేసుల సంఖ్య 14,781కి పెరిగింది.

అత్యధిక జనసాంద్రత కలిగిన ధారావీలోనూ కొత్త కేసులు పెరగడం కలవరం రేపుతోంది. కొత్తగా 46 కేసులు నమోదైనట్లు బృహన్ మంబయి మున్సిపల్ కార్యాలయం తెలిపింది. ఒకరు మరణించినట్లు స్పష్టం చేసింది.

దిల్లీలో 13మంది

దిల్లీలో మరో 13మంది వైరస్ ధాటికి బలయ్యారు. ఒక రోజులో ఇదే అత్యధికమని అధికారులు స్పష్టం చేశారు. 406 కొత్త కేసులతో బాధితుల సంఖ్య 7,639కి పెరిగింది. మృతుల సంఖ్య 86కి చేరింది.

తమిళనాడులో మరో 716 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8,718కి చేరింది.

పోలీస్ స్టేషన్​కు సీల్

హిమాచల్​ప్రదేశ్​లో 5 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 65కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. కాంగ్రా జిల్లాలోని ఓ పోలీస్​స్టేషన్​లో పని చేసే కానిస్టేబుల్​కు కరోనా సోకగా.. స్టేషన్​ మొత్తానికి సీల్ వేశారు అధికారులు. మొత్తం సిబ్బంది క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​లో మరో కొవిడ్ మరణం సంభవించింది. ఇప్పటివరకు మొత్తం 81మంది మరణించారు. 41 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 3,614కి చేరింది.

కర్ణాటకలో 42 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మొత్తం ఇన్ఫెక్షన్లు 904కి చేరాయి. ఇప్పటివరకు కరోనా కేసులేని హసన్ ప్రాంతంలో ఏకంగా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించగా.. 426 మంది కోలుకున్నారు.

విదేశాల నుంచి భారతీయులు వస్తున్న నేపథ్యంలో కేరళలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఇవాళ మరో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. మిగిలిన ఒక వ్యక్తి చెన్నై నుంచి వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 32 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మంది రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన వారే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details