మహమ్మారి. దీని ఆనుపానులేమిటో కచ్చితంగా తేల్లేదు. ఇప్పుడు ఎంతో మందిలో ఒక ఆశ.. ఒక అంచనా.. అదేమిటంటే వేడి వాతావరణంలో ఈ వైరస్ ఉనికి తగ్గిపోతుందని. ఇందులో వాస్తవమెంతన్నది శాస్త్ర విజ్ఞానానికీ అంతుచిక్కనప్పటికీ.. నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల శాతం మాత్రం ఉష్ణ మండల ప్రాంత దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ఇది ఆయా దేశాల్లోని వారికి ఒకింత ఊరట కలిగించే అంశం.
కరోనాపై విశ్వవ్యాప్తంగా నిపుణులు, శాస్త్రవేత్తలు నిర్విరామంగా పరిశోధనలు, అధ్యయనాలు జరుపుతున్నారు. వీరిలో కొందరు కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి, వాతావరణానికి సంబంధం ఉండొచ్చనే చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కరోనా వ్యాప్తి తగ్గుతుందన్న ఆశలూ చాలానే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలంతా పునరుద్ఘాటిస్తూ హెచ్చరిస్తున్నది మాత్రం - ఇది పూర్తిగా కొత్త వైరస్.. మహమ్మారులు ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించవు. అందువల్ల గణాంకాలను, కొన్ని ఉదాహరణలను బట్టి దేన్నీ స్పష్టంగా తేల్చలేమని, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రజలంతా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోక తప్పదని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.
భారత్(కొన్ని రాష్ట్రాలు) సహా ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్ద కలిసి 100కు పైగా ఉష్ణమండల దేశాలున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ కరోనా వ్యాప్తి ఇప్పటికీ 4 శాతం కంటే తక్కువే ఉండటం గమనార్హం. అలాగని వేడి ప్రాంతాల్లో ఈ వైరస్ లేదనీ కాదు.. ఉష్ణ వాతావరణం ఈ వైరస్ నుంచి కాపాడుతుందనీ చెప్పలేం.
'ఉష్ణం'పై ఆశలు.. అంచనాలు..
సాధరణంగా వైరస్‌లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉత్పరివర్తనం(మార్పులకు లోనవడం) చెందుతుంటాయి. కొవిడ్-19 కంటే ముందూ కొన్ని కరోనా వైరస్‌లు బయటపడ్డాయి. వాటిలో 2003లో విజృంభించిన ‘సార్స్’ వైరస్‌తో ప్రస్తుతం వణికిస్తున్న కొత్త కరోనా వైరస్‌కు కొన్ని పోలికలున్నాయి. దీంతో ‘సార్స్’ వ్యవహరించే తీరును పోలుస్తూ కరోనా కూడా వేడి వాతావరణంలో అంతగా వ్యాప్తి చెందదని కొందరు శాస్త్రవేత్తలు అంచనాకొస్తున్నారు. అలాగే ఇన్‌ఫ్లూయంజా వ్యాప్తి అత్యధిక ఉష్ణోగ్రతలు, తేమ ఉన్న ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే నిరూపితం అయింది. కరోనా విషయంలో ఇది తేలకున్నా.. భూ ఉత్తరార్థగోళంలోని పలు ప్రాంతాల్లో రానున్న వేసవి, వర్షాకాలాల్లో వ్యాప్తి మిగతా ప్రాంతాల కంటే కొంత తక్కువే ఉండొచ్చనీ భావిస్తున్నారు.
- వేడి వాతావరణంలోను, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు.. కొవిడ్ వ్యాప్తికి అవకాశాలు తక్కువేనని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనం తెలిపింది. హార్వర్డ్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజ్ డైనమిక్స్ డైరెక్టర్ మార్క్ లిప్సిట్చ్ ఇదే అభిప్రాయపడుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
- వైరస్‌ల వ్యాప్తి పెరగడానికి వివిధ కాలాలూ కారణమేనని మెల్‌బోర్న్‌లోని శ్వాస సంబంధ వైద్య నిపుణుడు, మొనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన టామ్ కొట్సింబోస్ తెలిపారు. అయితే కొత్త వైరస్ గురించి మనకేం తెలీదు కాబట్టి, ఇది ఇతర వైరస్‌ల మాదిరిగా లక్షణాలు చూపుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉందన్నారు.
- ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎపిడమాలజీ అండ్ పాపులేషన్ హెల్త్‌కు చెందిన డాక్టర్ మెరూ షీల్ ఏం చెబుతున్నారంటే.. కరోనా వైరస్ వ్యాప్తికి బయట ఉష్ణోగ్రతలకు సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేమీ లేవు. కొన్ని ఉష్ణ మండల ప్రాంతాల్లో (పసిఫిక్ దీవుల్లో) ఇన్‌ఫ్లూయంజా మాత్రం సీజనల్‌గా వ్యాప్తి చెందుతోంది.
- మనిషి శరీరం బయట (అంటే తుమ్మినా, దగ్గినా బయటకొచ్చే) వైరస్ ఎంతకాలం బతుకుతుందన్న విషయంలో వాతావరణం కీలకపాత్రే పోషిస్తుందని స్పెయిన్‌కు చెందిన నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ తెలిపింది. ఇది ఎంతకాలం బయట జీవించి ఉంటే వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
- మేరీలాండ్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా 5-11 డిగ్రీల సెంటీగ్రేడ్ వాతావరణం, తక్కువ తేమ ఉన్న నగరాల్లోనే ఉన్నట్లు తేలింది.
- హార్వర్డ్ మెడికల్ స్కూల్ మాత్రం ఆసియాలో కరోనా వైరస్ వ్యాప్తికి వాతావరణంతో అంతగా సంబంధం కనబడటంలేదని తెలిపింది. చైనాలో కరోనా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో విజృంభించిందని.. అప్పుడు చైనాలో జన సమ్మర్ధం ఉంటుందని ఉదహరించింది.
చైనాలో ఏం జరిగింది?
కొత్త కరోనాకు కేంద్ర బిందువైన చైనాలో దాదాపు 100 నగరాలను పరిశీలిస్తే.. ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి మిగతా నగరాల కంటే తక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. చైనాలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది. కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్‌లో దాదాపు 2,300 మంది చనిపోయారు. అప్పటికి ఆ నగరంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ తక్కువగా ఉంది. అయితే ఉష్ణోగ్రతలు, తేమ పెరిగిన తర్వాత మరణాలు బాగా తగ్గాయి. సాధారణంగా చలికాలంలో జలుబు, ఇన్‌ఫ్లూయంజా వంటివాటికి కారణమయ్యే వైరస్‌లు విజృంభిస్తుంటాయి. కొవిడ్-19 కూడా చైనాలో శీతాకాలంలోనే బయటపడింది. అనంతరం వ్యాప్తి చెందిన ఐరోపాలోను, అమెరికాలోనూ చాలా ప్రాంతాలు చలి వాతావరణంలోనే ఉన్నాయి.
ఉష్ణ మండల దేశాల కథేమిటి?