జనం సామూహికంగా గుమికూడే ప్రదేశాలకు, ఎక్కువమంది హాజరయ్యే కార్యక్రమాలు, సమావేశాలకు సాధ్యమైన మేరకు వెళ్లకపోవడం, తగిన దూరాన్ని పాటించడం సోషల్ డిస్టెన్సింగ్ ఉద్దేశం. అయితే ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్‌కు, క్వారెంటైన్, ఐసొలేషన్‌లకు తేడా ఉంది. ఒక నిర్దిష్ట ప్రదేశం, జోన్‌లో మాత్రమే వైరస్ ఇతరులకు సోకకుండా, వ్యాపించకుండా రోగుల్ని నియంత్రించడం క్వారెంటైన్, ఐసొలేషన్‌ల ఉద్దేశం. కానీ సోషల్ డిస్టెన్సింగ్‌లో ఇలాంటి ప్రాదేశిక నియంత్రణలేమీ ఉండవు. ముప్పును నివారించడానికి వ్యక్తులు తమకు తాము ప్రవర్తనను మార్చుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఏమేం చేయాలి?
ప్రయాణాలు తగ్గించండి
ప్రయాణాల వల్లే వైరస్ అత్యధికంగా వ్యాపిస్తోంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప విమానం, రైలు, బస్సు ప్రయాణాలు చేయొద్దు. భారత్‌లో రద్దీ వేళల్లో రైళ్లు, బస్సులు కిక్కిరిసి వెళుతుంటాయి. అవసరం అనుకున్నప్పుడు- రద్దీ లేని సమయాల్లోనే ప్రయాణించడానికి ప్రయత్నించండి.
రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దు
ఎక్కువమంది పోగయ్యే పాఠశాలలు, పబ్‌లు, థియేటర్లు, బహిరంగ మార్కెట్లు, ప్రార్థనాస్థలాలు, ఈత కొలనులు, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లకపోవడం మంచిది. 10 కన్నా ఎక్కువమంది పోగయ్యే గ్రూపుల్లో కలవకపోవడమే మంచిది.
ఇళ్లలోనే గడపండి
వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉండడం కోసం బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే గడపడం మేలు. ఇంటి నుంచే పనిచేయడానికి ప్రాధాన్యమివ్వండి. దానివల్ల సమూహాల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించొచ్చు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం వారికి దూరంగా గడపాలి.